Malaysia New PM: మలేసియా నూతన ప్రధాన మంత్రిగా సంస్కరణవాది, సీనియర్ లీడర్ అన్వర్ ఇబ్రహీం (75) ప్రమాణస్వీకారం చేశారు. రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా ఆయనతో ప్రమాణం చేయించారు.
20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి సంస్కరణల కోసం గట్టిగా నిలబడిన అన్వర్ పగ్గాలు చేపట్టడంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మలేసియా స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువ పెరిగాయి.
హంగ్ ఏర్పడినా
శనివారం జరిగిన మలేసియా పార్లమెంటు ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. అన్వర్ పార్టీ అలయన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు సాధించింది. 222 సీట్లు గల మలేసియా పార్లమెంటులో మెజారిటీ కావాలంటే 112 స్థానాలు రావాలి. మాజీ ప్రధాని ముహియుద్దీన్ యాసిన్ పార్టీ నేషనల్ అలయన్స్‌కు 73 సీట్లు వచ్చాయి. ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో కింగ్ కలుగజేసుకున్నారు.
హంగ్ పార్లమెంటుకు దారితీయడంతో రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా పలువురు పార్లమెంటు సభ్యులతో సంప్రదించి అన్వర్ ఇబ్రహీంను నూతన ప్రధానిగా గురువారం ప్రకటించారు.
మోదీ శుభాకాంక్షలు
మలేసియా నూతన ప్రధానిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీంకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
అన్వర్ ఇబ్రహీం.. ఎన్నికల్లో గెలిచి మలేసియా ప్రధానిగా మీరు ఎన్నికైనందుకు నా శుభాకాంక్షలు. భారత్-మలేసియా మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను.
Also Read: Gujarat Polls: తొలి విడత అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు- టాప్‌లో ఆప్!