Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఆప్‌నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లితో సహా ఏడుగురిపై అభియోగాలు మోపుతూ రోస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేసింది. చార్జిషీట్‌లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉండగా.. అయిదుగురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. మొత్తం 10 వేల పేజీలతో సీబీఐ చార్జ్ షీట్ రూపొందించింది. చార్జిషీట్‌లో విజయ్ నాయర్, అభిషేక్, సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిల్లై, ముత్తా గౌతమ్, కుల్‌దీప్ సింగ్, నరేందర్ సింగ్ పేర్లు చేర్చింది. కుల్‌దీప్ సింగ్, నరేందర్ సింగ్ ఇద్దరు ప్రభుత్వ అధికారులు. ఇంకా అయిదుగురిని అరెస్ట్ చేయలేదని సీబీఐ తెలిపింది.
చార్జిషీటులో ఉన్న వారిలో ఇంకా ఐదుగుర్ని అరెస్ట్ చేయలేదన్న సీబీఐ
ఈ ఏడుగురిలో అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్ తెలుగువారు. అరుణ్ రామచంద్ర పిళ్లై హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరిలో అభిషేక్‌ను అరెస్ట్ చేశారు కానీ ముత్తా గౌతమ్‌ను అరెస్ట్ చేయలేదు. అదే సమయంలో అరెస్ట్ చేసిన అరబిందో డైరక్టర్ పెనాక శరత్ చంద్రారెడ్డి పేరు చార్జిషీట్‌లో లేదు. అలాగే ఈ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు కూడా లేదు. త్వరలో అనుబంధ చార్జిషీటు వేసి వీనిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్ని ప్రశ్నిస్తున్నందున వారి వద్ద నుంచి మరింత సమాచారం తీసుకుని.. చార్జిషీట్ దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
ఎఫ్ఐఆర్‌లో ఏ -1గా ఉన్న సిసోడియా పేరు చార్జిషీటులో చేర్చని సీబీఐ
ఎఫ్ఐఆర్‌లో ఎ - 1 నిందితునిగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ పేర్కొంది. ఆయన అనుచరులు సిసోడియా దగ్గరి అనుచరులైన అమిత్ అరోఢా, దినేశ్ అరోఢా, అర్జున్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో దినేశ్ అరోఢాకు గత వారం ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దినేశ్ అప్రూవర్‌గా మారారు. ఇందుకు కోర్టు కూడా అంగీకరించింది. దినేశ్ విచారణకు పూర్తిగా సహకరించారని, కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చారని సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఈడీ చార్జిషీటు మరో రెండు, మూడు రోజుల్లో దాఖలు చేసే అవకాశం
ఇదే కేసులో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. అరబిందో డైరక్టర్ శరత చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ కాదు. ఈడీనే అరెస్ట్ చేసింది. పెద్ద ఎత్తున హవాలా ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే సీబీఐ చార్జిషీటులో పేరు లేకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈడీ చార్జిషీట్‌పై పడింది. రెండు , మూడు రోజుల్లో ఈడీ కూడా.. చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసు.. పూర్తిగా అవినీతి కోణంలో ఉంటుంది.. ఈడీ కేసు మాత్రం మనీలాంరింగ్.. అక్రమ నదదు చెలామణి కోణంలో ఉంటుంది. అందుకే రెండు చార్జిషీట్లలో ప్రధాన నిందితులు.. నిందితులు మారిపోతారని అంటున్నారు.