Pakistan Zindabad Slogan in Bharat Jodo Yatra:


అమిత్ మాల్వియా ట్వీట్‌పై కాంగ్రెస్ ఫైర్..


రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలోనూ బాగానే క్యాంపెయిన్ చేస్తోంది. అయితే...దీనిపై బీజేపీ ఇప్పటికే విమర్శలు చేస్తూనే ఉంది. ఎన్ని చేసినా కాంగ్రెస్‌ కాలం చెల్లిందని అంటోంది. ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర జరుగుతుండగా కొందరు "పాకిస్థాన్ జిందాబాద్" అని నినాదాలు చేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చివర్లో ఓ వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అని అరిచినట్టుగా వినిపిస్తోంది. "ఖర్గోన్‌లోని భారత్ జోడో యాత్రలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. నిజం అందరికీ తెలిసే సరికి వెంటనే డిలీట్ చేసింది" అని ట్వీట్ చేశారు మాల్వియా. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా ఈ ఆరోపణలను ఖండించారు. "ఉద్దేశపూర్వకంగా 
ఓ వీడియో చేసి భారత్ జోడో యాత్రపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు" అని ట్వీట్ చేశారు. తక్షణమే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి కుట్రలకు ముందుగానే సిద్ధమయ్యాయమని, అంతకంతకు మూల్యం చెల్లించుకుంటారని మండిపడ్డారు. డిసెంబర్ 4న భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌కు చేరుకుంటుంది. 










డబ్బులిస్తున్నారంటూ ఆరోపణలు..


భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సెలబ్రెటీలకు డబ్బులిస్తున్నారంటూ ఇటీవలే బీజేపీ నేత నితేష్ రాణే విమర్శించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచారు. దీనిపై స్పందిస్తూ...నితేష్ రాణే అలా విమర్శలు చేశారు. అయితే...దీనిపై బాలీవుడ్ నటి పూజా భట్ కౌంటర్ ఇచ్చారు. నితేష్ రాణే ట్విటర్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ మండి పడ్డారు. "రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పలువురు బాలీవుడ్ నటులు పాల్గొంటున్నారు. బహుశా వారికి కాంగ్రెస్ భారీ మొత్తంలో డబ్బు ముట్టు చెబుతున్నట్టుంది. అంతా గోల్‌మాల్" అని ట్వీట్ చేశారు..మహారాష్ట్ర బీజేపీ నేత నితేష్ రాణే. అయితే...ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ పూజాభట్ ఓ కోట్‌ని షేర్ చేశారు. నితేష్ రాణే పేరు ప్రస్తావించకుండానే..పరోక్షంగా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. "వాళ్ల ఆలోచనా విధానం అలాగే ఉంటుంది. వాళ్లవి మాత్రమే గొప్ప అభిప్రాయాలు అనుకుని వాళ్లను వాళ్లే గౌరవించుకుంటారు. వాళ్ల గురించి ఆలోచిస్తూ బతకడానికి ముందు నాతో నేను, నాకోసం నేను బతకాలి. దేనికీ కట్టుబడనిది ఏదైనా ఉందంటే.. అది మనస్సాక్షి మాత్రమే" అని హార్పర్ లీ రాసిన కొటేషన్‌ను ట్వీట్ చేశారు. పూజాభట్ మాత్రమే కాదు. అమోల్ పాలేకర్, రియా సేన్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి లాంటి బాలీవుడ్ ప్రముఖులు రాహుల్‌తో కలిసి నడిచారు. ఈ స్టార్స్‌ రాకతో...రాహుల్ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. 


Also Read: Mamata Suvendu Meet: ఆ ఓటమి తర్వాత తొలిసారి సువేందుతో దీదీ భేటీ!