Donald Trump Arrest: 


అరెస్ట్‌కు రంగం సిద్ధం..! 


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఓ అడల్ట్ యాక్ట్రస్‌తో ఆయనకు అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. సాధారణంగా అయితే..ఇలాంటి సందర్భాల్లో నిందితుడే వచ్చి లొంగిపోవాల్సి ఉంటుంది. అలా కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం పోలీసులే వచ్చి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ట్రంప్‌ తనకు తానుగా వచ్చి లొంగిపోయే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 4 వ తేదీన ఆయన పోలీసుల ఎదుట లొంగిపోతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టులో హాజరవుతారని సమాచారం. దీనిపై ట్రంప్‌ లాయర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ట్రంప్‌పై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో కోర్టులో ఆయన తప్పక హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ తరవాత కూడా చాలా తతంగం ఉంటుంది. వేలి ముద్రలు, ఫోటోలు ఇవ్వాలి. పేరు, డేటాఫ్ బర్త్...ఇలా అన్ని వివరాలూ కోర్టుకు అందించాలి. కొన్ని గంటల పాటు ఆయనను కస్టడీలోనే ఉంచాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌ అంతా ఫాలో అయితే మాత్రం...ట్రంప్‌ను పోలీసులు అరెస్ట్ చేయక తప్పదు. అలా అని పూర్తిగా ట్రంప్‌ అరెస్ట్ తప్పదనీ చెప్పలేం. తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ నిరూపించుకోగలిగితే...అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ...ట్రంప్‌నకు వాదించే అవకాశమే లేకుండా జడ్జ్..గాగ్ ఆర్డర్ ఇస్తే మాత్రం ఆయనకు చిక్కులు తప్పవు. న్యాయపరంగా ఎన్ని అకాశాలున్నాయో అన్నింటినీ వాడుకునేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఇంత చేసినా..ఆయనను కోర్టు దోషిగా తేల్చితే మాత్రం కనీసం నాలుగేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. 


ఇదీ కేసు...


ఇంతకీ ట్రంప్ ఏం నేరం చేశారని అరెస్ట్ చేస్తారు..? ఇది తెలియాలంటే 2016 కి రివైండ్ చేయాలి. 2016లో ప్రెసిడెంట్‌ రేస్‌లో నిలబడ్డారు ట్రంప్. అప్పటికే అడల్ట్ యాక్ట్రస్ స్టార్మీ డానియల్స్‌తో (Stormy Daniels) ఆయనకు అక్రమ సంబంధం ఉన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆ నటికి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చారన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దాదాపు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చారని కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడు, న్యాయవాది మైఖేల్ కోహెన్‌ ఇందుకు ప్రత్యక్ష సాక్షి అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆయనే స్వయంగా స్టార్మీ డానియల్స్‌కు ఆ డబ్బుని ఇచ్చినట్టు సమాచారం. దీనిపై మొదటి నుంచీ ట్రంప్‌ తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు. ఇవన్నీ అసత్య ఆరోపణలని...తనను వేధిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. అందుకే...ఆయన అలెర్ట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తనను అరెస్ట్ చేసే అవకాశముందని చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిజమే అని తేలితే ట్రంప్‌ జైలుకెళ్లక తప్పదు. ఆ నటికి డబ్బులిచ్చిన విషయాన్ని అంగీకరించకుండా మభ్య పెడుతున్నారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. డానియెల్స్ నోరు మూయించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్టు రుజువులు చూపించారు. 


Also Read: Amritpal Singh News: అమృత్ పాల్ పాకిస్థాన్‌కు పారిపోవడం బెటర్, లొంగిపోవడం కరెక్ట్ కాదు - శిరోమణి అకాలీ దళ్ చీఫ్