Amritpal Singh News:
పాకిస్థాన్ పారిపోవచ్చుగా..
పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు 8 రాష్ట్రాల్లో అలెర్ట్ ప్రకటించారు. అయితే...అమృత్ పాల్ వరుసగా వీడియోలు విడుదల చేస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నాడు. "నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేరుగా మా ఇంటికే రావచ్చుగా" అంటూ ఛాలెంజ్ చేశాడు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎంపీ, శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సిమర్జిత్ సింగ్ మాన్...కీలక వ్యాఖ్యలు చేశారు. అమృత్ పాల్ సింగ్...పాకిస్థాన్‌కు పారిపోవడం బెటర్ అని సూచించారు. ఆయన పోలీసులకు లొంగిపోకూడదని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
"1984లో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగిన సమయంలో చాలా మంది పాకిస్థాన్‌కు వెళ్లారు. అయినా అమృత్ పాల్ సింగ్‌కు నేపాల్ వెళ్లాల్సిన అవసరం ఏముంది..? పక్కనే పాకిస్థాన్ ఉందిగా. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం ఉంది"
- శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సిమర్జిత్ సింగ్ మాన్
1984లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దీనంతటికీ కారణం బింద్రనవాలేను మట్టు పెట్టాలని ప్రభుత్వం భావించింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ..జనరల్ సింగ్ బింద్రనవాలేను హతమార్చేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్‌కు అనుమతినిచ్చారు. అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో దాక్కున్న బింద్రనవాలేను హతమార్చింది ఇండియన్ ఆర్మీ. ఆ తరవాత సిక్కులైన బాడీగార్డుల చేతుల్లోనే ఇందిరా హత్యకు గురయ్యారు. ఆ సమయంలోనే సిక్కులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది.
కొన్నిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఖలిస్థానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ పంజాబ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. తనను అరెస్ట్ చేయాలన్నదే పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశమైతే నేరుగా తన ఇంటికి వస్తే లొంగిపోయేవాడినని స్పష్టంచేశాడు. నల్లటి తలపాగా ధరించి, శాలువాతో ఉన్న అమృత్‌పాల్ సింగ్ సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు. "పంజాబ్ పోలీసులు తనను అరెస్ట్ చేయాలని భావిస్తే, నేరుగా నా ఇంటికి వస్తే లొంగిపోయేవాడిని" అని చెప్పాడు. లక్షలాది మంది పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా సర్వ శక్తిమంతుడైన దేవుడు తమను కాపాడాడని తెలిపాడు. మరోవైపు, పంజాబ్ పోలీసులు హోషియార్‌పూర్ గ్రామం దాని పరిసర ప్రాంతాల్లో అమృత్‌పాల్ సింగ్ అతని అనుచరులు తలదాచుకున్నారనే సమాచారంతో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసుల నుంచి తప్పించుకుని గత 11 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నఅమృత్‌పాల్ సింగ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశాడు. అతను పోలీసులకు లొంగిపోవచ్చని వినిపిస్తున్న సంకేతాల నేపథ్యంలో ఈ వీడియో ప్రత్యక్షమైంది. అమృత్‌పాల్ సింగ్‌తో పాటు అతని సంస్థ 'వారిస్ పంజాబ్ దే' సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో జలంధర్ జిల్లాలో పోలీసుల కళ్లుగప్పి అతను తప్పించుకున్నాడు. అమృత్ పాల్ స్వర్ణ దేవాలయం వైపు వెళుతున్నాడని వదంతులు వ్యాపించడంతో హోషియార్‌పూర్‌లో భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.