Amritpal Singh New Video: పరారీలో ఉన్న మత ప్రభోదకుడు అమృతపాల్ సింగ్ పంజాబ్ పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. తాను ప్రజల మధ్యకు వస్తానని.. ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ గురువారం (మార్చి 30) తెలిపారు. తాను అరెస్టుకు భయపడనని, విదేశాలకు పారిపోనని అలాగే జుట్టు కత్తిరించుకోలేదని చెప్పుకొచ్చాడు. శ్రీ అకల్ తఖ్త్‌లోని జాతేదార్లు వహీర్ (మతపరమైన అవగాహన పర్యటన)ని తీసుకువెళ్తానన్నారు. అయితే వహీర్ అకల్ తఖ్త్ సాహిబ్ అంటే అమృత్‌సర్ నుంచి ప్రారంభమై బైసాఖీలోని తఖ్త్ దమ్‌దామా సాహిబ్ తల్వాండి సాబో వద్ద ముగుస్తుంది. బైసాఖీలో సర్బత్ ఖల్సాను అక్కడికి పిలవాలని అమృతపాల్ సింగ్ అన్నారు. తాను అరెస్టవుతాననే భయం తనకు లేదని.. కానీ తిరుగుబాటు మార్గంలో అలాంటి కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. అంతకుముందు అమృత్ పాల్‌కి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా గురువారం మధ్యాహ్నం బయట పడింది. అందులో అతను.. తాను లొంగిపోవడానికి చర్చలు జరుపుతున్నాడనే ఊహాగానాలను కొట్టిపారేసినట్లు ఉంది. అలాగే "సర్బత్ ఖల్సా"ని సమావేశపరచమని అకల్ తఖ్త్‌ను మళ్లీ కోరాడు.
గతంలో కూడా వీడియో విడుదల..
ఈ వీడియో విడుదలకు ఒకరోజు ముందు ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్ పాల్ ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇందులో సిక్కుల అత్యున్నత సంస్థ అయిన జతేదార్‌ను కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఒక సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. వీడియో క్లిప్‌లో కూడా సమస్య తన అరెస్టు మాత్రమే కాదని.. సిక్కు సమాజానికి సంబంధించిన సమస్యగా వాదించే ప్రయత్నం చేశాడు.
అమృతపాల్‌ను పట్టుకునేందుకు కొనసాగుతున్న అన్వేషణ
అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు పంజాబ్ పోలీసులు హోషియార్‌పూర్ గ్రామం, అనేక సమీప ప్రాంతాలలో ఆపరేషన్‌ను ప్రారంభించారు. పోలీసులు కూడా ఇంటింటికీ గాలింపు చర్యలు చేపట్టినా ఇంత వరకు ఫలితం లేకపోయింది. పంజాబ్ పోలీసులు మార్చి 18వ తేదీ నుంచి వారిస్ పంజాబ్ డి సంస్థ సభ్యులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి అమృతపాల్ సింగ్ పరారీలో ఉన్నాడు.
భారత నిఘా సంస్థ ఏం చెబుతోంది?
నేపాల్ లోని పాక్ రాయబార కార్యాలయం సహాయంతో అమృత్ పాల్ నకిలీ పాస్ పోర్టు సహాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడని భారత ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం అధికారిక సమాచారం ఇచ్చిన తర్వాత, నేపాల్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో, అన్ని స్టేషన్ల దర్యాప్తు ప్రక్రియను కఠినతరం చేసింది. నేపాల్ ప్రభుత్వం అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచింది. భారతదేశం నుంచి వచ్చే వ్యక్తుల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తోంది. అనుమానాల ఆధారంగా నేపాల్ పోలీసులు పలు చోట్ల నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. నేపాల్ లోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు హై అలర్డ్ లో ఉన్నాయి. ఖాట్మండులోని అంతర్జాతీయ విమానాశ్రయం, భైరహవాలోని గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. పరారీలో ఉన్న అమృత్ పాల్ ఫోటో నేపాల్ లోని అన్ని హోటళ్లు, గెస్ట్ హౌజ్ లు, లాడ్జీలలో ప్రచారం చేస్తున్నారు.