China - Taiwan:
తైవాన్‌ను ఒంటరి చేయాలని చూస్తోందా..?
నిన్న మొన్నటి వరకు యుద్ధం అనే మాట వినిపిస్తే రష్యా-ఉక్రెయిన్ పేర్లు గుర్తొచ్చాయి. ఇప్పుడు కొత్తగా చైనా-తైవాన్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. యూఎస్ హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనతో ఒక్కసారిగా ఈ రెండు దేశాల మధ్య వాతావరణం వేడెక్కింది. ఆమె తైవాన్‌లో పర్యటించటంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతే కాదు. తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో క్షిపణి దాడులనూ చేసింది. దీనిపై అగ్రరాజ్యం సహా జపాన్ కూడా ఆగ్రహంగా ఉంది. అసలు చైనా, తైవాన్ మధ్య ఎందుకీ వైరం..? తైవాన్‌పై ఆధిపత్యం కావాలని చైనా ఎందుకు కోరుకుంటోంది..? తైవాన్‌ను ఒంటరి చేయాలని భావించటం వెనక కుట్ర ఏంటి..?
తైవాన్ తమలో భాగమే అంటున్న చైనా..
తైవాన్ గురించి చైనా చేస్తున్న వాదన ఒకటే. తైవాన్..తమ భూభాగం నుంచి విడిపోయిన ఓ ప్రావిన్స్ అని చెబుతోంది డ్రాగన్ దేశం. అంటే..పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC)లో భాగమే అని అంటోంది. కానీ..తైవాన్ మాత్రం ఈ వాదనను ఎప్పటి నుంచో కొట్టి పారేస్తోంది. తమను తాము ప్రత్యేక దేశంగా చెప్పుకుంటోంది తైవాన్. అయితే ఇప్పటికీ ఈ దేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాగానే వ్యవహరిస్తున్నారు.
అసలు ఈ ఘర్షణ ఎప్పుడు మొదలైంది..?
1927లో చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నేషనలిస్ట్, కమ్యూనిస్ట్‌ల మధ్య ఈ యుద్ధం జరిగింది. అయితే...ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చింది. చైనాను ఆక్రమించాలని చూసిన జపాన్‌ను అడ్డుకోవటంలో మునిగిపోయింది డ్రాగన్ ప్రభుత్వం. ఆ సమయంలో అంతర్యుద్ధానికి తెర పడింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయాక, మరోసారి అంతర్యుద్ధం మొదలైంది. 1949లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ CCP,పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేసి, బీజింగ్‌ను రాజధానిగా ప్రకటించారు. అయితే నేషనలిస్ట్‌లు అంతా ఉన్నట్టుండి తైవాన్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధానిని తైపెయ్‌గా ప్రకటించుకున్నారు. వారితో పాటు దాదాపు 12 లక్షల మంది దీనికి ఆమోదం తెలిపారు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా..దాదాపు రెండు దశాబ్దాల వరకూ చైనా రాజధానిని తైపెయ్‌గానే గుర్తించింది. 1971లో యునైటెడ్ నేషన్స్ బీజింగ్‌ను చైనా రాజధానిగా గుర్తిస్తూ ఓ తీర్మానం పాస్ అయింది. అప్పుడే ప్రపంచమంతా చైనా రాజధానిగా బీజింగ్‌ను గుర్తించాల్సి వచ్చింది. తైవాన్ మాత్రం..రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగ ప్రకారం తమదీ ఓ దేశమేనని వాదిస్తున్నాయి. నియంతృత్వ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్య దేశంగా మారామని ప్రకటించుకుంది.
ఎప్పటి నుంచో ఘర్షణలు..
1680 నుంచి 1895 వరకూ..తైవాన్‌లోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా చైనా అధీనంలో ఉన్నాయి. అయితే చైనా-జపాన్ మధ్య జరిగిన యుద్ధంలో జపాన్ గెలిచింది. ఆ సమయంలో తైవాన్‌లోని కొన్ని ప్రాంతాలను జపాన్ హస్తగతమయ్యాయి. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిందో...మళ్లీ వెంటనే ఈ ప్రాంతాన్ని నేషనలిస్ట్ పార్టీకి తిరిగి అప్పగించింది. అంతర్యుద్ధంలో నేషనలిస్ట్‌లపై కమ్యూనిస్ట్‌లు
గెలవటం వల్ల పరిస్థితులు మారిపోయాయి. నేషనలిస్ట్‌లు అంతా తైవాన్‌కే పరిమితమైనప్పటికీ...స్వాతంత్య్రాన్ని మాత్రం ప్రకటించుకోలేదు. అయినా సరే...తమను ప్రత్యేక దేశంగానే పరిగణించాలని వాదిస్తున్నారు. అయితే చైనా ఇందుకు అసలు అంగీకరించటం లేదు. తైవాన్‌ను కేవలం ద్వీపంగానే పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా చైనాకు అనుకూలంగా ఓ ప్రకటన చేసింది. తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించటం లేదని చెప్పింది. PRC అనేది చైనా ప్రభుత్వమేనని, మరే ప్రాంతమూ ఈ పేరుని క్లెయిమ్ చేసుకోవటానికి వీల్లేదని తెలిపింది. 1972లో ఇందుకు సంబంధించిన తీర్మానంపై సంతకం కూడా చేసింది. ఆస్ట్రేలియా మద్దతుతో చైనా "వన్ చైనా పాలసీ" విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే..ఆర్థిక పరంగా మాత్రం తైవాన్‌కు తామెప్పుడూ మద్దతుగానే ఉంటామని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.
తైవాన్ విషయంలో అమెరికా స్టాండ్ ఏంటి..?
తైవాన్ విషయంలో అగ్రరాజ్యం వైఖరి స్పష్టంగానే కనిపించినా...ప్రత్యేక దేశంగా మాత్రం అధికారికంగా గుర్తించలేదు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో తైవాన్‌కు అండగా ఉంటామని చెబుతోంది అమెరికా. ఇటీవల హౌజ్ స్పీకర్ నాన్సీ తైవాన్‌లో పర్యటించటంపై చైనా ఉడికిపోయింది. ఇక్కడ కీలకంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే..అమెరికా-తైవాన్ మధ్య ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు. అయినా...తైవాన్‌కు అండగా నిలబడతామని స్పష్టం చేసింది. ఇటీవల నాన్సీ కూడా అదే విషయాన్ని చెప్పారు. తైవాన్‌ను ఒంటరిగా చేయాలనుకున్న చైనా ఆలోచనను తిప్పికొట్టారు.
చైనా..తైవాన్‌ను ఆక్రమిస్తుందా..?
ఇప్పటికైతే ఇలాంటిదేమీ జరగదన్నది అంతర్జాతీయ విశ్లేషకుల మాట. కేవలం బెదిరించో, ఆంక్షలు విధించో దారికి తెచ్చుకోవాలని చూస్తుంది తప్ప...ఆక్రమించటం వరకూ వెళ్లదని వివరిస్తున్నారు. చైనా ప్రస్తుతానికి క్షిపణి ప్రయోగాలు చేస్తూ తైవాన్‌ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ...ఆ భూభాగంలోకి చొచ్చుకుని పోయే సాహసం చేయదని స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటివరకైతే ఓ విషయం స్పష్టమవుతోంది. చైనా ఎప్పటికీ తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించదు. 2049లోగా తైవాన్‌ను తమ భూభాగంలో కలుపుకుంటామని డెడ్‌లైన్ కూడా పెట్టింది. ప్రస్తుతానికి చైనా ప్లాన్స్ ఏంటి అన్నది మాత్రం ఇంకా తేలలేదు.
Also Read: Pooja Hegde: ఒరిజినల్ సీత పూజ అట - హిట్ సినిమా మిస్ చేసుకుందే!