దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన 'సీతారామం' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. రష్మిక కీలకపాత్రలో కనిపించింది. తొలిరోజు నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ తెగ పొగిడేస్తున్నారు సినీ అభిమానులు. దీంతో చిత్రబృందం జోష్ లో ఉంది. లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం ఖాయం. 


నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట పూజాహెగ్డేను తీసుకున్నారు. ఆమె నెల రోజుల పాటు డేట్స్ ను కూడా కేటాయించింది. క్యాస్ట్ అండ్ క్రూ సెట్ అవ్వడంతో మేకర్స్ సెట్స్ ను సిద్ధం చేశారు. షూటింగ్ మొదలుపెట్టే సమయానికి పూజాకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో నిర్మాతలకు ఏం చేయాలో అర్ధం కాలేదు. షూటింగ్ వాయిదా వేస్తే భారీ నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. 


దీంతో అప్పటికప్పుడు హీరోయిన్ గా మరో అమ్మాయిని తీసుకోవాలనుకున్నారు. దర్శకుడు హను రాఘవపూడి.. సీత క్యారెక్టర్ కోసం మృణాల్ ఠాకూర్ అయితే బావుంటుందని అనుకున్నారు. వెంటనే ఆమెకి స్క్రిప్ట్ వినిపించి ఆన్ బోర్డ్ చేశారు. ఆ విధంగా పూజా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. కరోనా కారణంగా 'సీతారామం' లాంటి క్లాసిక్ హిట్ ను పోగొట్టుకుంది పూజా. ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్న పూజాకి ఈ సినిమా గనుక పడి ఉంటే మంచి డిమాండ్ ఉండేది. కానీ మంచి అవకాశాన్ని కోల్పోయింది. 


పూజా ఫ్లాప్ స్ట్రీక్:


పూజా కెరీర్ విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో ఆమెకి సరైన హిట్టు ఒకటి కూడా పడలేదు. 'రాధేశ్యామ్', 'బీస్ట్' సినిమాలు ఆమెని నిరాశ పరిచాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' సినిమా కూడా బోల్తా కొట్టింది. దీంతో అమ్మడు ఆలోచనలో పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'జనగణమన' సినిమా ఒప్పుకుంది. అలానే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో 'కభీ ఈద్ కభీ దివాలి', రణవీర్ సింగ్ తో 'సర్కస్' వంటి సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలపై అమ్మడు చాలానే ఆశలు పెట్టుకుంది. 


ప్రస్తుతం ట్రిప్ లో..


ఇప్పుడు ఈ బ్యూటీ షూటింగ్స్ నుంచి కొంత గ్యాప్ తీసుకొని ఫారెన్ ట్రిప్ కి వెళ్లింది. ముందుగా లండన్ కు వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇప్పుడేమో అమెరికాకు చెక్కేసింది. న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇంకొన్ని రోజులు అమెరికాలోనే ఉండి.. ఇండియా తిరిగి రాగానే సినిమా షూటింగ్స్ లో పాల్గోనుంది. 


Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?


Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్