ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సంతోషంగా ఉంది. హీరోలు అందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకు కారణం 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు సాధించిన విజయాలు అని చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరి పోశాయని చెప్పాలి.


థియేటర్లకు ప్రేక్షకులు రావడం మానేశారా? థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లో ఓటీటీ వేదికల్లోకి వస్తున్నాయని లైట్ తీసుకున్నారా? తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు, నిర్మాతలు, దర్శకులలో ఎన్నో సందేహాలు. అందుకని, షూటింగులు ఆపేసి మరీ డిస్కషన్లు సాగిస్తున్నారు. ఈ తరుణంలో డిఫరెంట్ జానర్ సినిమాలు రెండు వచ్చాయి. 'బింబిసార' (Bimbisara Movie), 'సీతా రామం' (Sita Ramam Movie)... రెండిటికీ మంచి టాక్ రావడంతో ఇండస్ట్రీ హ్యాపీగా ఉంది.


కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : చిరంజీవి 
'బింబిసార', 'సీతా రామం' చిత్ర బృందాలకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం లేదు అని బాధ పడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ఉత్సాహాన్నీ ఇస్తూ... కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదల అయిన చిత్రాలు రెండూ విజయాలు సాధించడం ఎంతో సంతోషకరం'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'సీతా రామం'. 'బింబిసార' చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులు అందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు అని ఆయన తెలిపారు.
 





రెండూ హిట్స్ : విజయ్ దేవరకొండ
''ఒకే రోజున విడుదలైన రెండు సినిమాలు విజయాలు సాధించాయని వినడం చాలా సంతోషంగా ఉంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక, సుమంత్ అన్న, హను రాఘవపూడితో పాటు 'సీతా రామం' చిత్ర బృందానికి కంగ్రాట్స్. సినిమా గురించి మంచి మాటలు వింటున్నాను. 'బింబిసార'కు గొప్ప స్పందన లభిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ గారు, హరి గారు, దర్శకుడు వశిష్ఠ, ఎంఎం కీరవాణి గారికి కంగ్రాట్స్'' అని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ట్వీట్ చేశారు.






నా కోసం రెండు సినిమాలు చూడండి : అడివి శేష్
చిరంజీవి, విజయ్ దేవరకొండ కంటే ముందు 'బింబిసార', 'సీతా రామం' విజయాల గురించి యువ హీరో అడివి శేష్ ట్వీట్ చేశారు. తనకు కొవిడ్ రావడంతో ఐసొలేషన్‌లో ఉన్నానని... తన కోసం ఉదయం ఒక సినిమా, తర్వాత మరో సినిమా చూడమని అడివి శేష్ (Adivi Sesh) పేర్కొన్నారు. 


Also Read : ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?






'బింబిసార' విజయం సాధించడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. బింబిసారుడి పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఆయన పేర్కొన్నారు. కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచిందని అన్నారు. 


Also Read : సీతా రామం రివ్యూ: హృదయాన్ని తాకే సీతారాముల కథ!