Delhi Traffic Rules: 


సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే..


కార్‌లో వెనక కూర్చున్న వాళ్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవటాన్ని ఢిల్లీలో తప్పనిసరి చేశారు. ఇండస్ట్రియలిస్ట్ సైరస్ మిస్త్రీ మృతితో కేంద్రం స్పందించి ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇప్పుడది ఢిల్లీలో అమల్లోకి వచ్చింది. పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మరీ...నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. న్యూఢిల్లీలోని కన్నాట్‌ ఏరియాలో బరకంబ రోడ్‌లోఈ డ్రైవ్ చేపట్టారు. "ఇప్పటికే ఈ నిబంధనను తప్పనిసరి చేశాం. వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీట్‌బెల్ట్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని చెబుతున్నారు. రూల్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు" అని ట్రాఫిక్ స్పెషల్ పోలీస్ కమిషనర్ సురేందర్ సింగ్ యాదవ్ వెల్లడించారు. వాహన తయారీదారులు వెనుక సీట్లకు కూడా సీటు బెల్ట్ అలారం వ్యవస్థను ప్రవేశపెట్టడాన్ని 
తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం అన్ని వాహన తయారీదారులు సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఉన్నాయి. కానీ అది ముందు సీట్లకు మాత్రమే పరిమితమైంది. "సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించినందున, వాహనాలలో వెనుక సీట్లకు కూడా సీట్ బెల్ట్ బీప్ సిస్టమ్ ఉంటుందని మేము నిర్ణయం తీసుకున్నాము" అని ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ చెప్పారు. 


నిర్లక్ష్యంతోనే ముప్పు..


సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR)లోని రూల్ 138 (3) ప్రకారం వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోరు. కానీ ఇది తప్పని సరి అని చాలా మందికి తెలియదు. కొందరికి తెలిసినప్పటికీ విస్మరిస్తుంటారు. వెనుక సీట్లో కూర్చొని సీటు బెల్టు పెట్టుకోని వారిని పోలీసులు చూసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. వారిపై ఎలాంటి జరిమానాలు కూడా విధించడం లేదు. అందుకే దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇటీవలి రోడ్డు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, 2020లో సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల 15,146 మంది మరణిస్తే... 39,102 మంది గాయపడుతున్నారు. ప్రయాణ సమయంలో కారు స్కిడ్ అయితే  సీటు బెల్ట్ మిమ్మల్ని కారులో సీటు నుంచి జారిపోకుండా కాపాడుతుంది. ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ ప్రకారం.. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు సీటు బెల్టు పెట్టుకుంటే వాహనంలో నుంచి బయటపడరు. కారు లోపలే ఉండటం మూలంగా ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉంటుంది.  సీటు బెల్టు  తల, ఛాతీ, వెన్నెముక, పొత్తి కడుపుపై బలమైన గాయాలు కాకుండా కాపాడుతుంది.  


కారులో ప్రయాణిస్తుంటే..  ప్రయాణీకుల శరీరం కూడా అదే వేగంతో ముందుకు వెళ్తుంది. ఆ సమయంలో ప్రమాదం జరిగితే 
డ్రైవర్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌ బోర్డ్ లేదంటే సైడ్ విండోను తాకే అవకాశం ఉంటుంది.  సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రయాణీకులు  సీటుకు సురక్షితంగా ఉంటారు.  కారు అకస్మాత్తుగా ఆగిపోతే వారి బాడీ కూడా అలాగే ఆగిపోతుంది. ప్రమాద సమయంలో తలకు బలమైన గాయాలు అవుతాయి. ఈ గాయాలు ఒక్కోసారి ప్రాణాలు తీసే అవకాశం ఉంది. అదే సమయంలో వెన్నెముక సైతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సీటు బెల్టు మూలంగా సీటుకు అంటిపెట్టుకుని ఉంటారు. 


Also Read: Tiger-Faced Plane: స్పెషల్‌ ఫ్లైట్‌లో భారత్‌కు ఆఫ్రికన్ చీతాలు, విమానాన్నీ పులిలా మార్చేశారే!