Manish Sisodia:


ఢిల్లీలోనే ఉన్నాను: సిసోడియా 


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాని మోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే సీబీఐ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఇది ఢిల్లీలో రాజకీయ దుమారం రేపింది. భాజపా వర్సెస్ ఆప్‌ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే CBI మనీష్ సిసోడియాపై లుకౌట్ సర్క్యులర్ (LOC)జారీ చేసింది. విదేశాలకు వెళ్లేందుకు వీల్లేందని ఆంక్షలు విధించింది. లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనపైనే మనీష్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. "సోదాలతో మీరు అనుకున్నది సాధించలేకపోయారు. అందుకే ఇప్పుడు నాపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదేం జిమ్మిక్ మోదీజీ..? నేనిప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. చెప్పండి నన్నెక్కడికి రమ్మంటారో..?" అని ట్వీట్ చేశారు. అయితే..అట సీబీఐ మాత్రం తాము ఆ నోటీస్‌ ఇవ్వలేదని చెబుతోంది. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం లేదని తెలిపింది. ఇటీవల సీబీఐ మనీష్ సిసోడియా ఇంటితో పాటు 7 రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. లిక్కర్‌ పాలసీతో సంబంధం ఉన్న ఈ రాష్ట్రాల్లోనూ తనిఖీలు చేసింది. లిక్కర్ పాలసీని ఉల్లంఘించిన
15 మందిలో సిసోడియా పేరు మొదటగా ఉందని కేంద్రం చెబుతోంది.





 


ఎలాంటి అవకతవకలు జరగలేదు: సిసోడియా  


కేంద్ర సంస్థల అధికారాల్ని భాజపా దుర్వినియోగం చేస్తోందని సిసోడియా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ ఎడ్యుకేషన్, హెల్త్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటోందన్న కారణంగానే కేంద్రం ఇలా చేస్తోందని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో తనను కేంద్రం అరెస్ట్ చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో తాను చేసిన అభివృద్ధిని భరించలేకే ఇలా కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికలు..భాజపా వర్సెస్ ఆప్‌, పీఎం మోదీ వర్సెస్ సీఎం కేజ్రీవాల్‌ మధ్య యుద్ధంలా మారనున్నాయని తేల్చి చెప్పారు. "బహుశా మూడు, నాలుగు రోజుల్లో నన్నుఅరెస్ట్ చేస్తుండొచ్చు. సీబీఐ నన్ను అరెస్ట్ చేసినా నేను భయపడను. మా సంకల్పాన్ని ఎవరూ ఏమీ చేయలేరు" అని స్పష్టం చేశారు సిసోడియా. "భాజపా సమస్య అంతా కేజ్రీవాల్‌తోనే. నా ఇంటిపైనా సీబీఐతో సోదాలు చేయించింది..కేవలం కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకే. నేను ఎలాంటి అవినీతికీ పాల్పడలేదు" అని వెల్లడించారు. ఏ ఎక్సైజ్‌ పాలసీ విషయంలో కేంద్రం తమను ఇబ్బంది పెడుతోందో...అది దేశంలోనే బెస్ట్ పాలసీ అని అన్నారు సిసోడియా. సీబీఐ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదని, వాళ్లు కేవలం అధిష్ఠానం ఆర్డర్లను తుచ తప్పకుండా పాటిస్తున్నారని చెప్పారు. అగౌరవపరచకుండా సోదాలు నిర్వహిస్తున్నందుకు సీబీఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుండటంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రపంచమంతా దిల్లీ ఎడ్యుకేషన్ మోడల్, హెల్త్ మోడల్ గురించి మాట్లాడుకుంటోందని ట్వీట్ చేశారు. లిక్కర్ 
పాలసీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఈ విధానమెంతో పారదర్శకమైందని అంటున్నారు సిసోడియా. 


Also Read: Property Disputes: ఆస్తి కోసం తాత అంత్యక్రియలు చేయనన్న మనవడు