సాధారణ వ్యక్తులతో పోలిస్తే పాలిచ్చే తల్లులకు, గర్బిణిలకు ఎక్కువ పోషకాలు అవసరం పడతాయి. వారికి ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది. శిశువు బలంగా ఎదగాలంటే తల్లులు పోషకాహారం తినాల్సిందే. తల్లి పాలను ‘లిక్విడ్ గోల్డ్’ అంటారు. ఎందుకంటే అవి బిడ్డకు ప్రాణాధారం. అందులో అన్నీ పోషకాలు ఉంటేనే ఆ చిన్నారి బలంగా ఎదుగుతుంది. పాలిస్తున్న తల్లి కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా రోజూ తినాల్సిందే. వాటిలో పోషకాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండాలి. ఈ ఆహారాలు గర్భిణిలకు కూడా ఉపయోగపడతాయి.
నట్స్
జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు ద్రాక్షులు, పిస్తాలు... ఇలాంటి గింజల్ని రోజూ గుప్పెడు తినాలి. మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు, మంచి కొవ్వులు, ఖనిజాలతో నిండి ఉంటాయివి. అలాగే అవిసెగింజలు కూడా తినడం చాలా ముఖ్యం. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. తల్లీ,బిడ్డ ఇద్దరికీ ఇవి అవసరం. తల్లి వీటిని తినడం వల్ల పోషకాలు పాల ద్వారా బిడ్డకు చేరుతాయి.
ఆకుకూరలు
ఆకుకూరలు పాల ఉత్పత్తిని పెంచడంలో ముందుంటాయి. వీటిలో ఫైటో ఈస్ట్రోజెన్లు ఉంటాయి, అవే పాల ఉత్పత్తిని పెంచుతాయి. పాలకూర, బ్రకోలీ వంటి కూరగాయలను పప్పులో కలిపి వండుకుని తింటే చాలా మంచిది. గర్భిణులకు ఎన్నో పోషకాలు అందుతాయి. పాలిచ్చే తల్లులు తింటే పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడు. ఆకుకూరలు తినడం వల్ల గ్యాస్ వస్తుందేమో అన్న భయం లేదు, పాలలోకి పిండి పదార్థాలు చేరవు. తల్లిలోనే ఉండిపోతాయి.
కొమ్ము శెనగలు
తెలుగిళ్లల్లో కొమ్ము శెనగలు అధికంగా వాడతారు. వీటిలో లాక్టోజెనిక్ లక్షణాలు ఎక్కువ. ఈజిప్షియన్ కాలం నుంచి దీన్ని పాల ఉత్పత్తిని పెంచే ఆహారంగానే పరిగణిస్తున్నారు. అందుకే బాలింతలు కొమ్ము శెనగలను రోజూ తింటే మంచిది.
తృణధాన్యాలు
ఓట్స్, బార్లీ, క్వినోవా... వంటి తృణధాన్యాలు తల్లి పాల ఉత్పత్తిని పెంచే హర్మోనును ప్రేరేపిస్తాయి. వీటిలో ఏదో ఒకటి రోజూ తినడం వల్ల పాల ఉత్పత్తి తగ్గదు.
అవకాడోలు
అవకాడో పండ్లలో గుండెకు మేలు చేస్తే కొవ్వులు అధికం. విటమిన్ బి, విటమిన్ కె, విటమిన్ సిలు లభిస్తాయి. శిశువు మెదడు అభివృద్ధికి అవకాడోలో ఉండే కొవ్వులు మేలు చేస్తాయి. రోజుకో అవకాడో పండు తిన్నా చాలు ఎంతో మేలు జరుగుతుంది.
Also read: పిల్లల కోసం శునకాన్ని పెంచాలనుకుంటే ఈ జాతి శునకాలే బెటర్, ప్రేమగా ఉంటాయ్
Also read: ‘గోల్డెన్ హనీ’ రోజుకో స్పూను తాగితే ఆ సమస్యలన్నీ దూరం, దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.