Munugodu Bypoll: తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. ఒకదాని తర్వాత మరో ఉప ఎన్నిక వస్తూ రాజకీయ కాక రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు మునుగోడు బైపోల్ గురించి రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలో ఎలాగైన సత్తా చాటాలని ప్రముఖ పార్టీల నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఆ పార్టీయే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నాయకులు బలంగా నమ్ముతున్నారు. 



రాష్ట్రరాజకీయాల్లో మునుగోడు కాక


రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు చాలా టైమే ఉంది. కానీ మునుగోడు ఎన్నిక ఆ సమయాన్ని కుదిస్తుందని అంతా అనుకుంటున్నారు. పార్టీలేవి రాజీపడే ధోరణితో అస్సలే లేవు. మునుగోడు ఉప ఎన్నికను అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అక్కడా, ఇక్కడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ సవాలుగా తీసుకున్నాయి. తమ బలాన్ని, బలగాన్ని, ఆర్థిక పుష్టిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి. హుజూరాబాద్ బైపోల్ రాష్ట్ర చరిత్రలో అత్యంత కాస్ట్లీగా నిలిచాయి. అయితే మునుగోడు ఎన్నిక దాని కంటే ఎక్కువ రేంజ్ కు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 



టీఆర్ఎస్ కు దీటుగా ఉండేలా..
 
ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు పోరులో ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే ప్రజా దీవెన పేరుతో భారీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నీళ్ల పంపకాలు వంటి అంశాలపై చాలా విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చాలా అంశాలను లేవనెత్తారు. కేసీఆర్ మాటల దాడి తీవ్రంగా ఉండటంతో అదే స్థాయిలో వాటిని తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. కేసీఆర్ చేసిన విమర్శలను ధాటిగా బదులివ్వాలని వ్యూహ రచన చేస్తున్నారు కమలదళ నాయకులు. మునుగోడులో భారీ సభ నిర్వహించాలని అనుకుంటోంది బీజేపీ. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా పర్యటన కొనసాగనుంది. అయితే మునుగోడు సభలో అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


భారీగా జనసమీకరణపై దృష్టి


ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన ప్రజా దీవెన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. దీంతో టీఆర్ఎస్ సభను తలదన్నేలా మరింత గ్రాండ్ గా ఉండేలా సభను నిర్వహించాలని బీజేపీ నాయకులు ప్రణాళికలు వేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ.. ఈ సభతో మరోసారి తమ సత్తా చాటాలని అనుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనాలను మునుగోడు సభకు తరలించాలని ప్రణాళిక రచిస్తున్నారు. అమిత్ షా సభలోనే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. 


షా టూర్ షెడ్యూల్


ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా బేగంపేటకు చేరుకుంటారు. తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత భాజపా కార్యకర్త ఇంటికి, ఆతర్వాత రైతులతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు మునుగోడు సభలో షా పాల్గొంటారు.