Property Disputes: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు ఓ కవి. కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఆర్థిక కారణాల వల్ల కుటుంబ సభ్యులను, బంధువులనూ కాదనుకుంటారు. కనిపెంచిన తల్లిదండ్రులనూ చంపడానికి వెనకాడరు. తోడబట్టిన సోదరులను, అక్కా చెల్లెల్లను హతమారుస్తుంటారు. స్నేహితులను దూరం చేసుకుంటారు. నా అన్న వారిని వద్దని అనుకుంటారు. పరిచయస్తులను ఎంతటి మోసం అయినా చేసేందుకు వెనకాడరు. ఆస్తి తగాదాల వల్ల అప్పటి వరకు కలిసి మెలిసి ఉన్న వారు సైతం బద్ధ శత్రువులు అవుతారు. తోడబుట్టిన వారు కూడా చంపుకునేంత కోపం చూపిస్తారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వారికి కూడా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. తర తమ భేదాలు మరచిపోతారు. వావివరసల గురించి ఆలోచించే సోయి ఉండదు. నలుగురిలో చెడ్డ పేరు వస్తుందన్నా.. పట్టించుకోరు. వారికి కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కావాలి. 


తాత అంత్యక్రియలు చేయద్దంటున్న మనువడు..!


ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం మండలం కొత్తపల్లిలో జరిగిన ఓ ఘటన మానవ సంబంధాలు మంట గలిచిపోతున్నాయని అనడానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఆస్తి పంచి ఇవ్వలేదని తాత అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ మనవడు నిరాకరించాడు. కడ చూపు కోసం వచ్చిన బంధువులు, అతడి తీరుతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతను ఎంతకూ మారకపోవడంతో ఇక వెనుదిరిగారు. బంధువులు అందరూ వెళ్లి పోవడంతో ఇంటి వద్ద మృత దేహం ఒక్కటే మిగిలి పోయింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడే ఉన్న పలువు సాయం తీసుకుని ఆ వృద్ధుడి అంత్యక్రియలను అధికారులే పూర్తి చేయించాల్సి వచ్చింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన చిన్న హనుమయ్య అనే 96 ఏళ్ల వృద్ధుడు, శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. చిన్న హనుమయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు గంగమ్మ, రెండో భార్య పేరు లక్ష్మమ్మ.


ఎకరం పొలం కోసమే ఈ గొడవంతా..


గంగమ్మకు ఒక కొడుకు, లక్ష్మమ్మకు ఒక కూతురు ఉంది. గంగమ్మ కుమారుడు రామాంజినప్ప కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. రామాంజినప్ప కొడుకు నాగ భూషణం, కూతురు కల్యాణి ఉన్నారు. హనుమయ్య రెండో భార్య లక్ష్మమ్మ కూతురు పేరు యల్లమ్మ. ఐదు నెలల క్రితం లక్ష్మమ్మ చనిపోయింది. అయితే యల్లమ్మకు తాత హనుమయ్య  ఎకరా పొలం రాసి ఇచ్చాడు. కానీ పెద్ద భార్య గంగమ్మ కుమారుడికి, మనవలకు ఆస్తి ఇవ్వలేదు. ఆ కోపం నాగ భూషణంలో ఉండేది. తాత చనిపోయినప్పటికీ నాగ భూషణం కోపం మాత్రం చల్లారలేదు. ఆ కారణంగానే తాత అంత్యక్రియలకు నాగభూషణం నిరాకరించాడు. నాగభూషణం హిందూపురంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తాత మరణ వార్త తెలియగానే నాగ భూషణం కొత్తపల్లి గ్రామానికి వెళ్లాడు. తాను అంత్యక్రియలు చేసేది లేదని చెప్పి హిందూపురానికి తిరిగి వచ్చేశాడు. 


ఎట్టకేలకు అంత్యక్రియలు చేసిన నాగ భూషణం..!


హనుమయ్య శుక్రవారం సాయంత్రం చనిపోగా.. శనివారం పగటి వరకు మనవడు నాగ భూషణం వస్తాడేమోనని వేచి చూశారు బంధువులు. ఇక లాభం లేదనుకుని వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇంటి వద్ద మృతదేహం ఒక్కటే మిగిలిపోగా.. పోలీసులుకు స్థానికులు సమాచారం అందించారు. మనవడికి ఫోన్ చేసి మాట్లాడారు. పోలీసుల జోక్యంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు మనువడు నాగ భూషణం వచ్చి తాత అంత్య క్రియలు పూర్తి చేశాడు.