టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు విజయ్ అండ్ టీమ్. ఇదిలా ఉండగా.. 'లైగర్' సినిమాను బాయ్‌కాట్ చేయాలని రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొందరు ట్రెండ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమా 'లాల్ సింగ్ చడ్డా' బాయ్ కాట్ దెబ్బకు అల్లాడింది. సినిమా ఆడక వందల స్క్రీన్లలో ఆటలను నిలిపివేశారు. 


అలానే అక్షయ్ కుమార్ లేటెస్ట్ సినిమా 'రక్షాబంధన్' మీద కూడా బాయ్‌కాట్  ప్రభావం పడింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయ్యాయి. సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటూ కరణ్ జోహార్ మీద దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. ఇప్పుడు ఆయన సహ నిర్మాణంలో రూపొందించిన 'లైగర్' సినిమాను సైతం బాయ్‌కాట్ చేయాలని నెట్టింట్లో ప్రచారం మొదలుపెట్టారు.


బాలీవుడ్ లో మొదలైన ఈ ప్రచారం 'లైగర్' సినిమా యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు.. కరణ్ జోహార్ బాగా ప్రమోట్ చేసే హీరోయిన్ అనన్య పాండే సైతం ఇందులో హీరోయిన్ గా నటించడంతో ఇంకా నెటిజన్లు ఈ బాయ్‌కాట్ క్యాంపెయిన్ ను బలంగా తీసుకెళ్తున్నారు. ఈ విషయంపై స్పందిస్తున్న విజయ్ దేవరకొండ.. బాయ్‌కాట్ చేస్తున్న వాళ్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ బాయ్‌కాట్ ట్రెండ్ మరింతగా వైరల్ అవుతుండడంతో విజయ్ ఫైర్ అయ్యారు. 


సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ పోస్ట్ పెట్టారు. 'మనం కరెక్ట్ ఉన్నప్పుడు మన ధర్మం మనం చేసినప్పుడు.. ఎవ్వడి మాటా వినేదే లేదు. కొట్లాడుదాం' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. మరోపక్క విజయ్‌కు అభిమానుల నుంచి సపోర్ట్ మొదలైంది. లైగర్ బాయ్‌కాట్‌కు వ్యతిరేకంగా #ISupportLIGER హ్యాష్ ట్యాగ్‌ ను ట్రెండ్ చేస్తున్నారు. 


ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్నా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండకు స్టార్‌డం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి విడుదలైన రోజే లైగర్ కూడా రిలీజ్ కానుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.


Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్


Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!