యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లేటెస్ట్ సినిమా 'లైగర్' (Liger Movie) చిత్రానికి వ్యతిరేకంగా కొందరు, మద్దతుగా కొందరు... సోషల్ మీడియాలో సినీ అభిమానులు, ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయారు. 'లైగర్' చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయమని ఉత్తరాది ప్రేక్షకులు ట్రెండ్ చేస్తుంటే... ఉత్తరాదిలో కొంత మందితో పాటు దక్షిణాదిలో విజయ్ అభిమానులు మద్దతు ఇస్తున్నారు. అసలు ఏంటి ఈ గొడవ? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... 


సపోర్ట్ చేయడానికి ముందు బాయ్‌కాట్ ట్రెండ్!
'లైగర్' సినిమాను బాయ్‌కాట్ చేయాలని రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొందరు ట్రెండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు... ఆ సినిమా నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు కావడం! అనన్యా పాండే కథానాయిక కథానాయిక కావడం! వాళ్ళ మీద వ్యతిరేకత సినిమాపైకి మళ్ళింది. ఆ రెండిటి కంటే ముఖ్యంగా 'లాల్ సింగ్ చడ్డా' బాయ్‌కాట్‌ ట్రెండ్ విషయంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. శుక్రవారం సాయంత్రం అవి ఎక్కువ హైలైట్ అయ్యాయి. 


ఆమిర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు ఇచ్చారా?
రీసెంట్‌గా హిందీలో బాయ్‌కాట్‌ ట్రెండ్ ఎక్కువ అయ్యింది. స్టార్ కిడ్స్, కరణ్ జోహార్ సినిమాలను బాయ్‌కాట్‌ చేయమని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రెండ్ చేస్తోంది. వాళ్ళు ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' సినిమానూ బాయ్‌కాట్‌ చేశారు. దీనిపై విజయ్ దేవరకొండను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే... 






విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ''మీరు ఒక సినిమాను బాయ్‌కాట్‌ చేయాలని అనుకుంటే.... మీరు ఆమిర్ ఖాన్ ఒక్కరిపై ప్రభావం చూపడం లేదు. సినిమాకు పని చేసిన వేలాది మందిపై ప్రభావం చూపుతుంది. వాళ్ళు తమ జీవనోపాధి కోల్పోతారు'' అని చెప్పారు. ఆ సమాధానం ఉత్తరాదిలో కొంత మంది ప్రేక్షకులకు నచ్చలేదు. మరో ఇంటర్వ్యూలో ''బాయ్‌కాట్‌ గ్యాంగ్‌కు ఎక్కువ అట్టెన్షన్ ఇస్తున్నాం. బాయ్‌కాట్‌ చేస్తే చేయనివ్వండి. మేం సినిమా చేస్తాం. చూడాలని అనుకునేవారు చూస్తారు. థియేటర్లలో వద్దనుకునేవారు టీవీ, ఫోనుల్లో చూస్తారు'' అని చెప్పారు. అదీ నచ్చలేదు. దాంతో మరింత రెచ్చిపోయారు. బాయ్‌కాట్‌ లైగర్ అంటూ ఎక్కువ ట్రెండ్ చేశారు. విజయ్ దేవరకొండ అభిమానులు వాళ్ళకు కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 






విజయ్ దేవరకొండ సేవా కార్యక్రమాలే కాదు... భక్తినీ బయటకు తీశారు!
'Boycott Liger' ట్రెండ్ ఉధృతం అయిన తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. 'I Support LIGER' (నేను 'లైగర్'కు మద్దతు ఇస్తున్నాను), 'Unstoppable LIGER' ('లైగర్'ను ఎవరూ ఆపలేరు') అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. శనివారం ఈ రెండు హ్యాష్ ట్యాగ్స్, ముఖ్యంగా 'ఐ సపోర్ట్ లైగర్' అనేది దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. లాక్‌డౌన్ టైమ్‌లో, తన ప్రతి పుట్టినరోజుకు విజయ్ దేవరకొండ చేసిన సేవా కార్యక్రమాల గురించి పోస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అంతే కాదు... వరదలు వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విరాళాల గురించి పోస్టులు చేశారు. 


విజయ్ దేవరకొండ చేసిన సేవా కార్యక్రమాల గురించి మాత్రమే కాదు... ఆయన గుళ్ళు, గోపురాలు తిరిగిన ఫోటోలతో పాటు ఇంట్లో చేసిన పూజ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. ఆయన హిందూ అనేది ప్రాజెక్ట్ చేస్తున్నారు. అది ఉత్తరాది ప్రేక్షకుల కోసమే అనేది కొందరి మాట. విజయ్ దేవరకొండలో హిందువును, ఆయన చేసిన మంచిని ప్రాజెక్ట్ చేయమని పరోక్షంగా చెబుతున్నారన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ కాదు... సపోర్ట్ ట్రెండ్ నడుస్తోంది. అదీ సంగతి!


Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!


'లైగర్' గురువారం (ఆగస్టు 25న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ఎలా ఉండబోతోంది? అనేది పక్కన పెడితే... విడుదలకు ముందు వార్తల్లో నిలుస్తోంది. మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది.


Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?