COVID Free Booster Dose:


డ్రైవ్‌ విజయవంతం కావాలి: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి 


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం ఉచితంగా బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈ ఫ్రీ వ్యాక్సిన్ డ్రైవ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. 75 రోజుల పాటు అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఉచితంగా టీకా వేయించుకోవచ్చు. 18-59 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా సరే ఈ ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హులు. అర్హులైనందరికీ ప్రికాషన్ డోస్‌లు అందించేందుకు ఈ డ్రైవ్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. రెండో డోస్ తీసుకుని 6 నెలల దాటిన వారు ఈ డోస్ తీసుకోవచ్చు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ డ్రైవ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై వర్చువల్‌గా సమీక్ష జరిపారు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ "కొవిడ్ వ్యాక్సినేషన్ అమృత మహోత్సవ్" ను విజయవంతం చేయాలని ఆదేశించారు. జన్ అభియాన్‌లో భాగంగా వీలైనంత ఎక్కువ మందికి ఈ డ్రైవ్‌ను చేరువ చేయాలని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన వారిలో ప్రికాషన్ డోస్ తీసుకున్న వారి సంఖ్య 8%గానే ఉందని, ఈ డ్రైవ్ ద్వారా సంఖ్యను పెంచాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారిపైనా దృష్టి సారించాలని తెలిపారు. 


75% మేర టీకాలు కేంద్రమే అందిస్తుంది..


బూస్టర్ డోస్‌లు వృథా కాకుండా, సమయానికి అందరికీ అందే విధంగా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రభుత్వంతో పాటు, ప్రైవేట్ సెంటర్లలోనూ డోస్‌లు ఎక్స్‌పైర్ అయ్యేంత వరకూ ఉంచకుండా, సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇక టీకాల కొరత రాకుండా, కేంద్రమే తయారీ సంస్థల నుంచి 75% మేర టీకాలను కొనుగోలు చేసి ప్రజలకు అందించనుంది. ఇన్నాళ్లు స్తబ్దుగానే ఉన్నా, ఈ మధ్య కాలంలో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. అందుకే ఈ డ్రైవ్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. బూస్టర్ డోస్‌లు తీసుకునే వారి సంఖ్యను పెంచాలన్నదే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. దేశంలో 18-59 ఏళ్ల మధ్య ఉన్న వారి జనాభా 77 కోట్లుగా ఉంది. వీరిలో 1% మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లకు పైబడిన 16 కోట్ల మంది జనాభాలో 26%, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు కూడా బూస్టర్ డోస్ తీసుకోని జాబితాలో ఉన్నారు. భారత్‌లో దాదాపు చాలా మంది రెండో డోస్ తీసుకుని 9 నెలలు దాటిపోయింది. ICMR సహా పలు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు...యాంటీబాడీస్ ఆర్నెల్లు మాత్రమే ఉంటాయని చెబుతున్నాయి. రెండు డోసులు తీసుకున్నా, బూస్టర్ డోస్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. 


Also Read: Good Morning CM Sir: గుడ్ మార్నింగ్ సీఎం సార్, ఈ రోడ్లు చూడండి : జనసేనాని సెటైర్