#GoodMorningCMSir

  ఏపీలో వైసీపీని టార్గెట్ చేస్తూ జనసేన కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టింది. గతంలో రోడ్ల పరిస్థితిపై ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేశారు జనసైనికులు, ఆ తర్వాత తామే స్వయంగా రోడ్ల మరమ్మతులు మొదలు పెట్టారు. అలా సోషల్ మీడియాలో హల్ చల్ చేసినా పెద్దగా ఉపయోగం లేదనుకున్నారో ఏమో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ తో హోరెత్తిస్తున్నారు. #GoodMorningCMSir అంటూ సోషల్ మీడియాలో డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఈ డిజిటల్ క్యాంపెయిన్ ని మొదలు పెట్టారు. పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఏపీలో రోడ్ల దుస్థితిని ట్వీట్ చేశారు. 


రాష్ట్రంలో రహదారులు అధ్వాన్న స్థితిలో ఉన్న విషయంపై ముఖ్యమంత్రిని మేల్కొలిపేలే  #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ ని పవన్ కళ్యాణ్ లాంఛనంగా మొదలు పెట్టారు. ఉదయం 8 గంటలకు ఆయన.. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి క్లియర్ గా తెలుస్తోంది. కారులో వెళ్తూ ఈ వీడియో తెలిసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు పవన్ కల్యాణ్. 






కార్టూన్లతో సెటైర్లు.. 
ఇటీవల సీఎం జగన్ పై సెటైరికల్ కార్టూన్లు పెడుతున్నారు పవన్ కల్యాణ్. సీఎం జగన్ హెలికాప్టర్లో వెళ్తున్నట్టు, సాధారణ జనం రోడ్లపై వెళ్తూ నరకం అనుభవిస్తున్నట్టు ఈ కార్టూన్లు ఉంటున్నాయి. తాజాగా వేసిన కార్టూన్ కూడా ఇలాగే హైలెట్ అవుతోంది. హెలికాప్టర్ లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద బైక్ లలో వెళ్ళే వారిని వింతగా చూస్తున్నట్టు ఈ కార్టూన్ ఉంటుంది. వారంతా గోతుల్లో పడి గాల్లోకి ఎగిరి మళ్లీ గోతిలో పడటం ఆ కార్టూన్లో ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారిని పరిస్థితి ఎలా ఉందో ఈ కార్టూన్లో కనపడుతోందంటూ పవన్ ట్వీట్ చేశారు. 






వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతూనే, అదే సమయంలో వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేసేలా జనసేన డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. అందులోనూ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ తో సెటైరిక్ గా జగన్ పై విమర్శలు మొదలు పెట్టింది. హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేయడంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దిట్ట. అందులోనూ ఇది వైసీపీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా జగన్ ని టార్గెట్ చేసే హ్యాష్ ట్యాగ్స్.. అందుకే ఈ విషయంలో జనసైనికులు మరింత ఉత్సాహంగా ఉంటారని తెలుస్తోంది. ఆమధ్య తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గాల సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు మోదీని టార్గెట్ చేశారు. కేటీఆర్ కూడా జుమ్లామోదీ అంటూ ట్వీట్లు వేశారు. సోషల్ మీడియాలో అవి టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి సెన్సేష్ క్రియేట్ చేయడానికి జనసైనికులు సిద్ధమయ్యారు. పనిలో పనిగా రోడ్ల దుస్థితిని ఫొటోల ద్వారా సోషల్ మీడియాలో ప్రజల కళ్లకు కడుతున్నారు.