Indian Army's Kite:
ఉత్తరాఖండ్‌లో శిక్షణ..
యుద్ధ వ్యూహాలు మారిపోతున్నాయి. పెద్ద ట్యాంకులతోనే కాదు. చిన్న చిన్న పరికరాలతోనూ దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అలాంటి వాటిలో డ్రోన్‌లు కీలకమైనవి. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పదేపదే డ్రోన్‌ల కలకలం రేగుతోంది. దీనిపై భారత్ వ్యూహం మార్చింది. శత్రుదేశం నుంచి వచ్చే డ్రోన్‌ల ఆట కట్టించేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. గద్దలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి ఆ డ్రోన్‌లను గాల్లోనే ధ్వంసం చేయనున్నారు. ఇప్పటికే నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తుండగా..ఇప్పుడా జాబితాలో భారత్ కూడా చేరింది. భారత్, అమెరికా జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ "యుద్ధ్ అభ్యాస్"లో భాగంగా...ఉత్తరాఖండ్‌లో ఈ శిక్షణ కొనసాగుతోంది. దాదాపు 15 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. సైన్య వ్యూహాలను ఇరు దేశాలూ ఇచ్చి పుచ్చుకుంటాయి. విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? అనేదీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. సరిహద్దు ప్రాంతాల నుంచి డ్రోన్‌లు వస్తుంటే..వాటిని ముందుగానే పసిగట్టే విధంగా గద్దలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య దాదాపు 3 వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ము...ఈ సరిహద్దుకి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో డ్రోన్‌లు తరచుగా కనిపించాయి. డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున సరఫరా
చేస్తూ ఇవి కంటపడ్డాయి. బీఎస్‌ఫ్ బలగాలు వీటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. అయితే...తరచూ ఇదే సమస్య ఎదురవుతుండటం వల్ల పూర్తి స్థాయిలో దీనికి పరిష్కారం కోసం పక్షులను రంగంలోకి దింపారు. సైన్యాలు పక్షులను వినియోగించడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచ యుద్ధాల సమయంలో పావురాలను వినియోగించేవారు. జర్మన్లు డేగలను వాడే వారు.
తెలంగాణలో..
తెలంగాణలోనూ 2020లో రాష్ట్ర ప్రభుత్వం Integrated Intelligence Training Academy (IIITA) కు కీలక అనుమతులు ఇచ్చింది. గరుడ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ముఖ్యమైన సభలు, కార్యక్రమాలు జరిగినప్పుడు అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు డ్రోన్‌లను న్యూట్రలైజ్ చేసేందుకు ఈ గరుడ స్క్వాడ్ అందుబాటులో ఉంటుంది. ఇక నెదర్లాండ్స్‌లో 2016లోనే ఇది అమల్లోకితీసుకొచ్చారు. ఫ్రాన్స్‌లోనూ 2017లో రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఇలా గద్దలకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు.