KCR Delhi Plan Delay :  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్ని టాస్క్‌గా తీసుకున్నారు. ఆ విషాయన్ని ఆయనే స్వయంగా చెప్పాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఎన్నికల కమిషన్ వద్ద నడుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా మారుతుందని ఇప్పటి వరకూ అనుకున్నారు. అందుకే కేసీఆర్ డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలో  భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ జెండా, అజెండాను ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ షెడ్యూల్ మారిపోయింది. ఆయన ఢిల్లీ పర్యటన గురించి టీఆర్ఎస్ వర్గాలు మాట్లాడటం లేదు. అంతే కాదు.. జాతీయ రాజకీయాల ప్రస్తావన కూడా తగ్గిపోయింది. 


డిసెంబర్ నెల అంతా తెలంగాణలోనే కేసీఆర్ బిజీ ! 


డిసెంబర్‌ నెలలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో వివిధ జిల్లాలో పర్యటించనున్నారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధమయ్యారు. డిసెంబర్‌ 4న బహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. డిసెంబర్‌ 7న జగిత్యాలలో కేసీఆర్‌ సభ ఉండనుంది.  జగిత్యాల సభకు ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ కవితను నియమించారు. దాదాపు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఈ సభలకు ఇప్పటికే ఇన్‌చార్జిలను సైతం నియమించారు. అదేవిధంగా కేసీఆర్‌ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.  డిసెంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండనున్నాయి. ఈ లైనప్ చూస్తే కేసీఆర్ డిసెంబర్ నెలలో ఢిల్లీ పర్యటన ఉండకపోవచ్చని అర్థం చేసుకోవచ్చు.  


టీఆర్ఎస్ ..బీఆర్ఎస్‌గా మారడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయా ?


టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) గా మార్చే ప్రక్రియ  ప్రస్తుతం నడుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో బహిరంగంగా పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్చాలన్నా, లేదా ఏవైనా సవరణలు చేయాలన్నా జనాల నుంచి అభ్యంతరాలను పరిశీలించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రాంతీయ వార్తా పత్రికలతో పాటు, ఇంగ్లీషు పేపర్లలోనూ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కేంద్రం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ బహిరంగ ప్రకటన ఇచ్చింది. పార్టీ పేరు మార్చే విషయంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, వాటిని ఈసీకి పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపవచ్చని పేర్కొన్నారు. ఈ గడువు వచ్చే వారంతో ముగుస్తుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం.. ఎన్నికల కమిషన్ సమయం తీసుకుంటుంది.  భారత రాష్ట్ర సమితి పేరుతో రిజిస్ట్రేషన్ కోసం మరో మూడు పార్టీలు అంతకు ముందే ఈసీకి దరఖాస్తు చేసుకున్నాయని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అందుకు సమయం పడుతుందని కేసీఆర్ .. తెలంగాణపై దృష్టి సారించినట్లుగా భావిస్తున్నారు. 


ముందు ఇంట గెలిచి .. ఆ తర్వాత జాతీయ స్థాయికి వెళ్లే ఆలోచన చేస్తున్నారా ? 


బరాబార్ జాతీయ రాజకీయాల్లోకి వస్తామని కేసీఆర్ చెబుతున్నారు. కానీ ముందుగా ఆయన.. తెలంగాణలో తేల్చుకోవాలనుకుంటున్నారన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లోనూ వినిపిస్తోంది.   ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తాజాగా జరుగుతున్న పరిణామాలతో స్పష్టమవుతోదంంటున్నారు. అందుకే జిల్లాల పర్యటనలు.. పథకాల అమలు.. కొత్త పథకాల ప్రకటన.. ఇలాంటివి రానున్న రోజుల్లో మరింత పెరగనున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో గెలిస్తే తిరుగుండని.. జాతీయ స్థాయిలో మూడో సారి గెలిచిన సీఎంగా ప్రత్యేక క్రేజ్ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఓ వైపు దర్యాప్తు సంస్థల దూకుడు ఎక్కువ అవుతోంది. పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో.. ముందుగా పట్టు పెంచుకోవాలని కేసీఆర్ డిసైడయ్యారని అంటున్నారు.  పార్టీని బీఆర్ఎస్‌గు గుర్తించినప్పటికీ.. ఆయన ఢిల్లీలో రాజకీయాలు చేసేది.. తెలంగాణలో లెక్కలు సరి చూసుకున్న తర్వాతేనన్న అభిప్రాయం బలపడుతోంది.