కరోనా కోరల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతోంది ప్రపంచం. జనాల్లో అతి త్వరగా వ్యాపించింది కరోనా. ఇలాంటి లక్షణాలతో మరొక అంటు వ్యాధి పుట్టుకొచ్చింది. ఇది కూడా కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. ఈ అంటువ్యాధి పేరు ‘కేమల్ ఫ్లూ’. ఇది వ్యాప్తి చెందకూడదన్నా కూడా ముఖానికి షీల్డులు, నోటికి మాస్కులు అవసరం. 


ఖతార్‌లో జరిగే FIFA ప్రపంచ కప్‌ను వీక్షించే ప్రేక్షకులను కేమల్ ఫ్లూ వణికిస్తోంది. ఇది ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ (MERS). FIFA ప్రపంచకప్ చూడటానికి 1.2 మిలియన్ల మంది జనం ఉండటం వల్ల ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండొచ్చని WHO నివేదిక చెబుతోంది.


ఏమిటీ ఈ ఫ్లూ?
సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో డాక్టర్ సోలిమాన్ ఫకీ హాస్పిటల్‌లో 2012లో మొదటి కేసు నమోదైంది. తరువాత ఈ ఫ్లూ కేసులు అత్యధికంగా అరేబియా ద్వీపకల్పంలో బయటపడ్డాయి. ఈ వ్యాధి నిర్ధారణ అయిన వారిలో దాదాపు 35% మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధిగానే చెప్పుకోవాలి. 


లక్షణాలు
ఇదొక శ్వాసకోశ వ్యాధి. సౌదీలో దీన్ని అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS)గానే చెప్పుకుంటారు. ఈ ఫ్లూ సోకాక కింద చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. 
1. జ్వరం
2. దగ్గు
3. శ్వాస ఆడకపోవుట
4. అతిసారం 
5. వాంతులు 
6. అజీర్తి
7. పొత్తి కడుపు నొప్పి


ఈ ఫ్లూ రావడానికి కారణం  ‘MERS కరోనావైరస్’ (MERS-CoV) దీనికి కారణం. దీని జన్యువులను క్లాడ్ A, క్లాడ్ Bలుగా ఫైలోజెనెటిక్‌గా విభజించారు. 


నివారణ ఎలా?
ఈ వైరస్ పనిచేసే మెకానిజం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు వైద్యులు, శాస్త్రవేత్తలకు. ఎవరికైనా పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని కలవాలి. అలాగే ఇది ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
1. నోటికి మాస్క్ ధరించాలి.
2. ముఖానికి షీల్డ్ పెట్టుకోవాలి. 
3. కళ్లకు గాగుల్స్ పెట్టుకోవాలి. 
4. చేతికి గ్లవ్స్ వేసుకుని పనిచేయాలి. 
5. చల్లటి వాతావరణంలో కాకుండా ఎండలో ఎక్కువసేపు ఉండేందుకు ప్రయత్నించాలి. 


Also read: కఫంతో బాధపడుతున్నారా? రోజుకు రెండు సార్లు లవంగ టీ తాగితే బెటర్














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.