Congress presidential poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. అక్టోబర్ 19న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో 24 ఏళ్ల తర్వాత తొలి సారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారు.
రాహుల్ ఓటేస్తారా?
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేస్తారా? లేదా అన్న విషయంలో కాంగ్రెస్ శ్రేణులకు సందేహాలు ఉన్నాయి. దీంతో ఈ అంశంపై పార్టీ కీలక నేత జైరాం రమేశ్ స్పందించారు.
గెలుపెవరిది?
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. వీరి మధ్య గట్టిగానే పోటీ నెలకొంది. అయితే ఎక్కువ మంది మాత్రం ఖర్గే వైపే మొగ్గు చూపతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అందుకే కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఖర్గే ఆకాంక్షించారు.
" దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకే నేను పోరాడాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా మోదీ, షా రాజకీయాలు చేస్తున్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. వీరిపై పోరాడాలంటే నాకు అధికారం కావాలి. అందుకే పార్టీ సభ్యుల సూచన మేరకు నేను అధ్యక్ష ఎన్నికల్లో పోరాడుతున్నాను. "
ఖర్గే అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నాయకులు అశోక్ గహ్లోత్, దిగ్విజయ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, ఎకె ఆంటోనీ, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్ నేతలు ప్రతిపాదించారు. జీ 23 నాయకులు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ మద్దతు ఇచ్చారు.
థరూర్
అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గేకు పోటీగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నామినేషన్ దాఖలు చేశారు. తాను ఎవరికీ పోటీగా బరిలోకి దిగలేదని పార్టీపై ప్రేమతోనే ఇది చేస్తున్నట్లు శశి థరూర్ అన్నారు.
" పార్టీ అధికారికంగా ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించలేదు. గాంధీ కుటుంబం ఈ రేసులో తటస్థంగా ఉంటుందని, వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులను తాము స్వాగతిస్తామని కాంగ్రెస్ అధినేత్రి నాకు హామీ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇది ఎవరినీ అగౌరవపరచడం కాదు. స్నేహపూర్వక పోటీ. మేము ప్రత్యర్థులం కాదు. మేం ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేసిన నేతలం. మల్లికార్జున్ ఖర్గే మా పార్టీకి 'భీష్మ పితామహుడు'. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకోనివ్వండి. ఖర్గే గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడను. "
-శశి థరూర్, కాంగ్రెస్ నేత
Also Read: Gujarat Polls: గుజరాత్‌లో ఆప్ దూకుడు- 12 మంది అభ్యర్థులతో ఐదవ జాబితా విడుదల!