Bagalkot Lovers Death: కృష్ణా నది వెనక జలాల్లో దొరికిన మృతదేహం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రేమ జంట చావు గురించిన నిజాలు పోలీసుల విచారణలో బయటకు వచ్చాయి. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు.. ఆ యువకుడిని మాత్రం ఆమె కుటుంబ సభ్యులే కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది.
వెలుగులోకి విస్తుపోయే నిజాలు
కర్ణాటక బాగల్ కోటె పరిధిలోని కృష్ణా నది వెనక జలాల్లో స్థానికులు యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ యువకుడి మృతదేహంపై ఉన్న దుస్తులు సహా ఇతర ఆధారాలతో ఆ యువకుడి మృతికి గల కారణాలు అన్వేషించారు. ఓ ప్రేమ జంట చావు రహస్యాన్ని బాగల్ కోటె పోలీసులు ఛేదించారు. యువతి సూసైడ్ చేసుకోగా.. ఆ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చంపినట్లు తేలింది. యువకుడి మృతదేహం లభించింది. యువతి శవం కోసం అధికారులు ఇంకా గాలిస్తున్నారు. నిందితులను పట్టుకోగా ఈ విషయం బయటకు వచ్చింది.
అడ్డంగా దొరికిపోయారు.. ఆపై ఇలా జరిగింది
విజయపుర జిల్లా తికోటా తాలూకా ఘోణసగి ప్రాంతానికి చెందిన మల్లిఖార్జున జమఖండి, కల్లవటగికి చెందిన గాయత్రి విజయపురలోని ఓ కళాశాలలో చదువుతున్నారు. ఘోణసగి ప్రాంతం నుండి విజయపురకు బస్సులో వెళ్తుండగా వీరు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్లింది. గత నెల 23 వ తేదీన 20 ఏళ్ల మల్లిఖార్జున 18 ఏళ్ల గాయత్రి ఇంటికి ఒంటరిగా వెళ్లాడు. పొలంలో ఉన్న ఇంటిక పక్కనే ఓ గదిలో వారు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా.. గాయత్రి తండ్రి వారిద్దరినీ గమనించాడు. వారిని లోపలే ఉంచి బయట నుండి తలుపుకు గడియ పెట్టి తాళం వేశాడు. తండ్రి వారిద్దరినీ చూడటంతో గాయత్రి భయపడిపోయింది. గదిలో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
కాసేటికి బంధువులను తీసుకుని ఆ గది వద్దకు వచ్చిన గాయత్రి తండ్రి తాళం తీసి లోపలికి వెళ్లగా.. గాయత్రి విగత జీవిగా పడిపోయి కనిపించింది. దీంతో ఆవేశం పట్టలేకపోయిన గాయత్రి తండ్రి, వారి బంధువులు మల్లికార్జునను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఓ స్తంభానికి కట్టి అందరూ కలిసి కొట్టారు. తర్వాత అతడి చేత బలవంతంగా పురుగుల మందు తాగించారు దాంతో మల్లిఖార్జున అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
యువతి మృతదేహం కోసం గాలింపు
వారిద్దరి మృతదేహాలను వాళ్లంతా కలిసి వేర్వేరు సంచుల్లో కట్టారు. సెప్టెంబరు 24వ తేదీన కొర్తికొల్లార వంతెన వద్ద కృష్ణా నదిలో పడేశారు. అక్టోబర్ 5వ తేదీన గాయత్రి అపహరణకు గురైనట్లు తికోటా పోలీసులకు గాయత్రి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. యువకుడు కనిపించకుండా పోయినట్లు అతడి కుటుంబ సభ్యులు మరో కేసు నమోదు చేసినట్లు బాగల్ కోటె ఎస్పీ జయ ప్రకాశ్ తెలిపారు. అక్టోబర్ 10వ తేదీన బీళగి వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం పై ఉన్న దుస్తులు, ఇతర ఆధారాలతో ఆ మృతదేహం మల్లిఖార్జునది గా గుర్తించారు. తర్వాత దర్యాప్తు చేయగా ప్రేమికులు ఆత్మహత్య, హత్యోదంతం బయట పడింది.