Pawan Kalyan: ఉడత ఊపులకు అస్సలు భయపడను, చిలకపలుకుల్లా చిలక బూతులు - వైసీపీ నేతలపై పవన్ ధ్వజం

ABP Desam Updated at: 16 Oct 2022 12:46 PM (IST)

విశాఖపట్నంలో నిన్న జరిగిన పరిణామాలపై పవన్ కల్యాణ్ నేడు (అక్టోబరు 16) మీడియా సమావేశం నిర్వహించారు. అధికారం గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని పవన్ అన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

NEXT PREV

వైఎస్ఆర్ సీపీ నేతల ఉడత ఊపులకు తాను భయపడబోనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. విశాఖపట్నంలో నిన్న (అక్టోబరు 15) జరిగిన పరిణామాలపై పవన్ కల్యాణ్ నేడు (అక్టోబరు 16) మీడియా సమావేశం నిర్వహించారు. అధికారం గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఏ విధంగా నడవాలన్నది ఒక కుటుంబం నిర్ణయిస్తోందని విమర్శించారు. అధికారంలో ఉండి గర్జనలు చేస్తామనడం ఏంటో అర్థం కావట్లేదని చెప్పారు. కడుపు కాలిన వారు, సమస్యల్లో ఉన్నవారు గర్జనలు చేస్తుంటారని అన్నారు. 


‘‘ఈ ఉత్తరాంధ్ర పర్యటన మూడు నెలల క్రితమే నిర్ధారించాం. మూడు రాజధానుల కార్యక్రమం కంటే మూడు రోజుల ముందే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. అసలు మా పార్టీ కార్యక్రమాలు ఎలా నడపాలో వైసీపీకి చెప్పాలా? జనవాణి అంటే జనం పడుతున్న బాధలు. వారి సమస్యలను వెలుగు లోనికి తెచ్చే ప్రయత్నం. ఆ జనం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడా మా వల్ల ఇబ్బందులు ఎదురు కాలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలను చేతిలో ఉంచుకొని ప్రజా సమస్యలు పక్కన బెట్టి ఎంతసేపూ బూతులు మాట్లాడుతూ వైసీపీ కాలయాపన చేయడం వల్లనే జన వాణి పెట్టాల్సి వచ్చింది.


మా నాన్న పోలీస్ కానిస్టేబుల్. అందుకే పోలీసులంటే నాకు అభిమానం. పోలీసులు పైనున్న రాజకీయ నాయకుల ఆర్డర్స్ ఫాలో అవుతారు. మీరు అంత స్ట్రిక్ట్ గా పనిచేసే వారైతే.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు సాల్వ్ చేయలేక పోయారు. ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదన్న జగన్ కింద మీరు పని చేస్తున్నారని గుర్తు ఉంచుకోండి. గంజాయి స్మగ్లర్లనూ, వారిని వెంటేసుకొచ్చే రాజకీయ నేతలను  వదిలేసి.. ప్రజాస్వామ్యయుతంగా జనవాణి జరిపే మమ్మల్ని వేధిస్తున్నారా? ఈ పర్యటనలో మాకు అసలు అమరావతి లేదా మూడు రాజధానుల మీద అజెండానే లేదు. అసలు 2014 లోనే విశాఖ రాజధాని అంటే సరిపోయేది కదా?


అధికారం ఎందుకు పంచరు?
అధికార వికేంద్రీకరణ కోరుకుంటే.. ముందు ప్రభుత్వంలోని 48 శాఖలు, 26 మంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. వీరికి అధికారం ఎందుకు పంచరు? మొత్తం అధికారం అంతా ఒకరి దగ్గరే ఎందుకు పెట్టుకున్నారు? వైసీపీ నేతలు చిలక పలుకుల్లా.. చిలుక బూతులు మాట్లాడుతున్నారు. ఏ బూతులు మాట్లాడాలో వీరికి పైనుండి రాసి ఇస్తున్నారు. కులానికో కార్పొరేషన్ పెడతారు.. కానీ ఏ ఒక్కదానికీ నిధులు ఇవ్వరు. ఇదంతా కేవలం ఒక్క వ్యక్తి చేతిలోనే ఉన్నాయి. బూతులు తిట్టడానికి మాత్రమే వికేంద్రీకరణ పాటిస్తున్నారు. ఆ ఒక్కడి వల్ల చాలా కంపెనీలు ఏపీ నుండి వెళ్లిపోయాయి.’’



రాష్ట్రంలో ఏం నడవాలి అన్నది కేవలం ఒక్క కుటుంబం మాత్రమే నిర్ణయిస్తుంది. అసలు అధికారంలో ఉన్నవాడు గర్జించడం ఏంటి? కడుపు కాలిన వాడు కదా అరవాలి.. గర్జించాలి. పోలీసులు నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం తీవ్రంగా చేశారు. నేను వైసీపీ గుండా గాళ్ల ఉడత ఊపులకు భయపడేది లేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. వైసీపీ వాళ్ళు నన్ను చాలా సార్లు బెదిరించే ప్రయత్నం చేసారు. ర్యాలీ చేసినందుకు 100 మందిని అన్యాయంగా అరెస్టు చేశారు. సంబంధం లేని వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. మా కెమెరాలు తీసుకు పోయారు.. నా కారు కీస్ పోలీసులకు ఎందుకు అసలు. రెచ్చగొట్టడానికి కావాలంటే నా దగ్గరా చాలా ఆయుధాలు ఉన్నాయి. - పవన్ కల్యాణ్


వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కావాలని.. ప్రత్యేక రైల్వే జోన్ కావాలని జగన్ ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? అరెస్ట్ చేసిన మా నాయకులను భేషరతుగా విడుదల చేసే వరకూ జనవాణి నిలుపుదల చేస్తున్నాం. ఒకవేళ వదలకపోతే మా కార్యాచరణ ఏంటో తెలియజేస్తాం. మా శ్రేణులపై ఏకంగా 307 సెక్షన్ పెట్టారు. హత్యాయత్నం చేసిన వాళ్ళపై పెట్టాల్సిన కేసులు ఇవి. భవిష్యత్తులో అన్నీ మీకు తెలియజేస్తాం. దశాబ్దాల రాజకీయానికి సిద్ధపడే రంగంలోకి దిగాము. ప్రజాస్వామ్యం కోసం చనిపోవడానికి నేను సిద్ధం. కోడి కత్తి కేసు లానే.. నిన్నటి విశాఖ ఘటన చూస్తున్నాం. వారిని వారే పొడిపించుకున్నట్టు.. నిన్నటి దాడి జరిగి ఉండొచ్చు. ఉత్తరాంధ్రలో శాంతి ఉండకూడదనేదే వైసిపీ వ్యూహం. 


మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు అసూయా? 
నేను వచ్చే సమయానికి మంత్రులు ఎయిర్ పోర్ట్ కు రావడం వెనుక స్కెచ్ ఉందని భావిస్తున్నాం. ప్రజా ఉద్యమాలను వైసీపీ తట్టుకోలేదు. వైజాగ్ ని కొత్తగా డెవలప్ చేసే ఆవసరం ఏముంది? శ్రీకాకుళంలో పెట్టండి.. నేను వద్దనే ధైర్యం కూడా చెయ్యను. మాట్లాడితే నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటారు.. మీరూ చేసుకోండి.. ఎవరు వద్దన్నారు. నాకు కుదరలేదు అందుకే చట్ట బద్దంగా విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నా. బహుశా వైసిపీ నేతలకు నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అసూయ ఉండొచ్చు. అందుకే మాట్లాడితే ఆ టాపిక్ ఎత్తుతున్నారు’’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.

Published at: 16 Oct 2022 11:03 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.