మూడున్నరేళ్ల పాలనలో వైసీపీ రంగులు వేయడం తప్ప 3 ప్రాంతాలకి చేసింది శూన్యం..


ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు టీడీపీ మహిళా నేత గౌతు శిరీష. వైసీపీ 3 రంగులు వేయడం తప్ప 3 ప్రాంతాలకి చేసింది శూన్యం అని ఎద్దేవా చేశారు. కనిపించిన వాటికి పేర్లు మార్చడం తప్పా, చేసిన డెవలప్ గురించి అడిగితే చెప్పేందుకు 151 మందిలో ఒక్క ఎమ్మెల్యే అయినా ముందుకొస్తారా అని ప్రశ్నించారు. బ్రిటీష్ వారికన్నా దారుణంగా వైఎస్ జగన్ పాలన ఉందన్నారు. అభి వృద్ధి, సంక్షేమం లేకుండా వర్గాల మధ్య చిచ్చు, గొడవలు పెట్టి కాలయాపన చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ.. వైసీపీ బారి నుంచి మన ఉత్తరాంధ్రను కాపాడుకుందామంటూ టీడీపీ శ్రేణులకు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. 
భూ బకాసురులు పెరిగిపోయారు.. కార్యకర్తలు కూడా వారి వెనకలేరు
పలాసలో భూ అక్రమాలు పెరిగిపోయాయని, భూ బకాసురుడుగా మంత్రి సీదిరి అప్పలరాజు మారారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు కూడా ఆయన వెంటన రావడం లేదన్నారు. తన పదవి దక్కించుకునేందుకు, తన పరపతి ఉందని చూపించుకునేందకు స్కూలు, కాలేజీ విద్యార్ధులను బెదిరించి సభలు, సమావేశాలకు, కార్యక్రమాలకు రప్పిస్తున్నారని ఆరోపించారు. ఎండలో వారితో పనులు చేపిస్తున్నారని, ఇదేనా సంక్షేమ పాలన అని ప్రశ్నించారు.


ఏడవలేక నవ్వినట్లు మంత్రి పరిస్థితి !
సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిర్వహించిన సభలు, కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన కరువైందన్నారు. దాంతో ఏడవలేక నవ్వినట్లు ఆయన పరిస్థితి తయారైందన్నారు. ఈ మధ్య వచ్చిన మరో మంత్రి ఫొటో షూట్లకు పరిమితం అయ్యారని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారంటూ మండిపడ్డారు. వచ్చే ఒకటిన్నర సంవత్సరాలు ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు. ఈ క్రమంలోనే విశాఖ గర్జన లాంటి కార్యక్రమాలు చేపట్టి ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టే పనులకు అధికార వైసీపీ నేతలు, మంత్రులు శ్రీకారం చుట్టారంటూ మండిపడ్డారు.
ప్రత్యేక హోదా గర్జనలు ఏమయ్యాయి !





విశాఖ గర్జనకు కాలేజీ విద్యార్థులను, డ్వాక్రా మహిళలను బెదిరించి భయపెట్టి తీసుకు వస్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం గర్జించిన గర్జనలు, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పిన మాటలకు సమాధానం చెప్పాలి. అలాగే వైజాగ్ లో వైసీపీ నేతల భూకబ్జాల గురించి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు.
Also Read: జనసేన నేతల్ని తక్షణమే విడుదల చేయండి, లేకపోతే తీవ్ర పరిణామాలు !: పవన్ కళ్యాణ్