విశాఖలో శనివారం అర్ధరాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన ప్రైవేట్ హోటల్ నోవాటెల్ కు వెళ్లిన పోలీసులు జనసేన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దాంతో విశాఖలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. హోటల్ కు దాదాపు వంద అడుగుల మేర మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. తమ పార్టీ శ్రేణుల అరెస్ట్ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని తక్షణమే విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని, తమ పార్టీ నేతల్ని విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.
పోలీసుల ప్రవర్తన దారుణం.. జనసేనాని ఫైర్
విశాఖపట్నంలో పోలీసులు జనసేన నేతలతో దారుణంగా ప్రవర్తించారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పోలీసుల తీరు  చాలా దురదృష్టకరం అన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ఏపీ పోలీసులను గౌరవిస్తుందన్నారు. కానీ తమ పార్టీ నేతల్ని అకారణంగా అరెస్ట్ చేశారని, వారిని విడుదల చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జనసేనాని ఏపీ పోలీసులకు సూచించారు.






వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద వైసీపీ మంత్రులు, కీలక నేతలపై దాడికి పాల్పడ్డారంటూ జనసేన నాయకులు, కార్యకర్తలను విశాఖ పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఓ ప్రైవేటు హోటల్ లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్లోర్ లోకి పోలీసులు వెళ్లారు. అనంతరం ఆ హోటల్ లో బస చేస్తున్న జనసేన నేతలు పీవీఎన్ ఎన్ రాజు, సుందరపు విజయ్ కుమార్ సహా మరికొందరు జనసేన నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తరలించారు. వారిపై వివిధ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆర్కే రోజా సహా మరికొంత మంది మంత్రులను 300 మంది వరకూ జనసేన కార్యకర్తలు దూషించడంతో పాటు వారిపై రాళ్లు, పదునైన ఇనుప వస్తువులు, పార్టీ జెండా కర్రలతో హత్య చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేసినట్టు కేసులు నమోదు చేశారు పోలీసులు.


Also Read: విశాఖలో రాళ్లదాడి ఘటన - అర్ధరాత్రి జనసేన నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు 


విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదమైంది. వైసీపీ నేతలు నిర్వహించిన విశాఖ గర్జన ముగించుకుని విమానాశ్రయానికి చేరుకోగా అదే సమయంలో  మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి జనసైనికుల పని అని, వైసీపీ నేతలు, మంత్రులు గుడివాడ అమర్ నాథ్, రోజా ఆరోపించారు. జనసైనికులు ఎవరిపై దాడి చేయలేదని, తమ కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి అధికార వైసీపీ చేస్తున్న కుట్ర ఇది అని జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తన పర్యటనను అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే.. పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు దిగుతానంటూ పోలీసులకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ గర్జన విఫలం చెందిందనే అక్కసుతోనే ప్రభుత్వం ర్యాలీ ఆపిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.