విశాఖ లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం నాడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద వైసీపీ మంత్రులు, కీలక నేతలపై దాడికి పాల్పడ్డారంటూ జనసేన నాయకులు, కార్యకర్తలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఓ ప్రైవేటు హోటల్ లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్లోర్ లోకి వెళ్లిన పోలీసులు జనసేన నేతలు పీవీఎన్ ఎన్ రాజు, సుందరపు విజయ్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వారితో సహా మరికొందరు జనసైనికులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిపై వివిధ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆర్కే రోజా సహా మరికొంత మంది మంత్రులను 300 మంది వరకూ జనసేన కార్యకర్తలు దూషించడంతో పాటు వారిపై రాళ్లు, పదునైన ఇనుప వస్తువులు, పార్టీ జెండా కర్రలతో హత్య చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేసినట్టు కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. ఈ దాడిలో పెందుర్తి SI నాగేశ్వర రావు సహా ఆయన సిబ్బంది, సామాన్య ప్రజలు దిలీప్ కుమార్ , సిద్దు, సాయికిరణ్, హరీష్ సహా ఇతరులకు గాయాలు అయినట్టు పోలీసులు తెలిపారు. జనసైనికుల కారణంగా దాదాపు 30 మంది ప్రయాణికులు తాము ఎక్కవలసిన విమానాన్ని మిస్ అయినట్టు విశాఖ పోలీసులు వివరించారు. 

 

అర్ధరాత్రి అరెస్టులు-విశాఖ లో ఉద్రికత్త : 

సీసీ ఫుటేజ్ ఆధారంగా మంత్రులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశామన్న పోలీసులు అర్ధరాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఆయన సహచరులు, పార్టీ నేతలు బస చేసిన హోటల్ వద్దకు వెళ్లి సోదాలు నిర్వహించారు. అలానే జనసేన నేతలను కూడా అదుపులోనికి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్లోర్ లోకి పోలీసులు చేరుకోవడం తో ఉద్రికత్త నెలకొంది. ఆదివారం నాడు విశాఖలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది. అయితే , ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో అని రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఏపీ ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది. 

 

ఎయిర్ పోర్ట్ లో వైసిపీ నేతలపై జనసేన శ్రేణులు దాడికి యత్నం ! 

శనివారం సాయంత్రం విశాఖ గర్జన సదస్సు పూర్తి చేసుకుని వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకున్న మంత్రులు రోజా, జోగి రమేష్,టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై అక్కడే పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్న జనసైనికుల్లో కొందరు దాడి చేశారనీ, అందులో తమ సిబ్బందిలో కొందరికి తీవ్ర గాయాలు అయినట్టు  వైసిపీ నేతలు ఆరోపించారు. దీనిపై వైసిపీ నేతలు భగ్గుమన్నారు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులు గుడివాడ అమర్ నాథ్, అంబటి రాంబాబు లాంటి నేతలు ఈ దాడికి  పవన్ బాధ్యత వహించాలి అని డిమాండ్ చేయగా, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు అవాంఛనీయం అన్నారు. ఇక విశాఖలోని వైసిపీ వర్గాలు పవన్ దిష్టి బొమ్మను దహనం చేశాయి. 

జనసేన కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. ఇదంతా తమ జనవాణి కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ ఆడుతున్న డ్రామా గా కొట్టిపడేసారు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్. అసలు దాడి చేసింది జనసేన కార్యకర్తలే అనడానికి రుజువు ఏంటని ఆయన ప్రశ్నించారు. జనసేన కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ డ్రామాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.