Minister Gudivada Amarnath : విశాఖ గర్జనను డైవర్ట్‌ చేయడమే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడ్డారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. విశాఖ వైసీపీ కార్యాలయంతో మీడియాతో మాట్లాడిన ఆయన... పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు.  విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కోసం జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన ర్యాలీ నిర్వహించారని తెలిపారు.  భారీ వర్షం కురుస్తున్నా ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారన్నారు. గర్జనను డైవర్ట్‌ చేయడమే పవన్‌ కల్యాణ్‌ లక్ష్యమని, అందుకే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు చేశారని మంత్రి ఆరోపించారు. పవన్‌కల్యాణ్‌  ఒక శిఖండిలా వ్యవహరిస్తున్నారన్నారు.


చెవుల్లో పూలు పెట్టొద్దు 


ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులతో సమావేశం, జనవాణి పేరుతో పవన్‌ కల్యాణ్‌ విశాఖలో పర్యటన మొదలుపెట్టారని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. ఇక్కడి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారా? ఈ ప్రాంతంపై మమకారం ఉందా? అది లేకపోయినా ఉన్నట్లు చూపుతున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు. నిజానికి విశాఖ ప్రజలు ఓడించినందుకు పవన్ ఈ ప్రాంతంపై కక్ష కట్టారని ఆరోపిచారు. అందుకే ఈ ప్రాంతంపై విద్వేషం చూపుతున్నారని విమర్శించారు. ఇక్కడ వెనకబడిన ప్రాంతం గురించి పట్టించుకోకుండా, రాజకీయ ప్రయోజనం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.


 క్యారెక్టర్‌ ఉంటే 


 మంత్రులు, నాయకుల మీద దాడులెంటని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. వైయస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు తల్చుకుంటే పవన్ కనీసం ఒక్క నిమిషం అయినా ఉండగలరా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ఫ్లెక్సీలు చింపడం ఏమిటని నిలదీశారు.  పవన్ కల్యాణ్ కు అసలు క్యారెక్టర్‌ ఉంటే కదా? అది ఉంటే కార్యకర్తలు కూడా పద్ధతిగా ఉంటారన్నారు. జనసేనకు ఒక సిద్ధాంతం, లక్ష్యం లేదన్నారు. 


క్షమాపణలు చెప్పాలని డిమాండ్ 


"ఇవాళ్టి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే దీనిపై వెంటనే పవన్‌కల్యాణ్‌ స్పందించాలి. మా పార్టీకి, నాయకులను క్షమాపణలు చెప్పాలి. ఇవాళ ఈ ఉద్యమానికి తూట్లు పొడవడానికి వచ్చిన పవన్, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా క్షమాపణ చెప్పాలి. మీకు సిగ్గు లేదు. లక్ష్యాలు లేవు. ఒక ప్రాంతం మీద అభిమానం లేదు. ఎక్కడికి పోతే ఆ మాట మాట్లాడతావు. కర్నూలుకు పోతే, అక్కడే రాజధాని ఉండాలంటావు. అమరావతి వస్తే అక్కడే రాజధాని అంటావు. విజయనగరం వెళ్తే, అక్కడే రాజధాని అంటావు. ఉండడానికి రాష్ట్రంలో ఇల్లు లేదు. పక్క రాష్ట్రంలో ఉంటావు. నీవు ప్రజల కోసం కాకపోయినా, నీ కోసం అయినా బతకాలి కదా? ఇంట్లో గెలవలేని వాడివి.. రచ్చలో ఏం గెలుస్తావు? పెళ్లి అనేది ఒక సర్దుబాటు జీవితం. అందులో ఇమడలేని వాడివి ప్రజా జీవితంలో ఎలా నెగ్గుకురాగలవు? అందుకే ఆ ఫ్రస్టేషన్‌ అంతా చూపిస్తున్నావు. కార్యకర్తల మీద, ప్రజల మీద, ప్రాంతాల మీద చూపిస్తున్నావు. ప్రజల ఆకాంక్షలను తప్పుదోవ పట్టించి తద్వారా లబ్ధి పొందడం. చంద్రబాబు డబ్బులు ఇస్తారు తీసుకుంటున్నావు." - మంత్రి అమర్ నాథ్ 


ఉద్యమంపై జరిగిన దాడి 


 "పవన్ నటన జీవితం ఇచ్చింది విశాఖపట్నం. నటన నేర్పింది విశాఖపట్నం. తొలుత నీకు పిల్లను ఇచ్చింది విశాఖపట్నం. చివరకు నీవు పోటీ చేసింది విశాఖలోనే. అయినా అన్నీ మర్చిపోయావు. ఉత్తరాంధ్రను వాడుకుని, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయాలని చూస్తున్నావు. ఉద్యమానికి తూట్లు పొడవాలని నీవు చేస్తున్న పనులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ పార్టీకి, తెలుగుదేశానికి ఉత్తరాంధ్ర అవసరం లేదు. ఇక్కడి ప్రజలు అవసరం మీకు లేదు. అయినా ఎందుకొచ్చారు. ఇవాళ్టి దాడులపై చర్యలు తప్పవు. చట్టం తన పనితాను చేస్తుంది. ఉద్యమం మీద చేసిన దాడికి పవన్‌కల్యాణ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలి. పవన్‌ ఒక రాజకీయ శిఖండి. ఎవరు ఎవరి మీద దాడి చేశారు? మాపై వారు చేశారా? ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంటే, ఆయన ఎందుకు వచ్చినట్లు? కేవలం ఉద్యమానికి తూట్లు పొడిచే ప్రయత్నం కాదా? ఇవాళ మా పార్టీ నాయకులేమీ ప్రేరేపించలేదే? వారు విమానాశ్రయానికి వెళ్తుంటే రెచ్చిపోయి దాడి చేసింది ఎవరు? కేవలం పవన్‌కళ్యాణ్‌ వైఖరి వల్లనే ఇదంతా జరిగింది. పవన్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దాడి చేశారంటున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చెప్పడం హాస్యాస్పదం. ఇక్కడ జేఏసీ విశాఖ గర్జన కార్యక్రమం ప్రకటించిన తర్వాతే, పవన్‌ తన పర్యటన ప్రకటించారు. దీంతో ఆయన ఉద్దేశం ఏమిటన్నది అర్ధం అవుతోంది. ఇది మాపై మాత్రమే చేసిన దాడి కాదు. ఉద్యమంపై చేసిన దాడి. ఉదయం నుంచి చూశారు. ర్యాలీ ఎంత చక్కగా జరిగిందో? ఎంత మంది హాజరయ్యారో? పవన్‌కళ్యాణ్‌ వచ్చాకే ఈ దాడి జరిగింది. దీన్ని బట్టి ఆయన వైఖరి ఏమిటి అన్నది తెలుస్తోంది కదా? "అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.