నోటి శుభ్రత చాలా ముఖ్యం. అధికంగా తీపి పదార్థాలు, పేస్ట్రీస్ వంటి వాటిని తరచూ తినడం వల్ల దంతాలు పుచ్చిపోవడం సమస్య తలెత్తుతుంది. పంటి సమస్యలు వస్తే వాటిని భరించడం చాలా కష్టం. అందుకే దంతాలు, నోరు పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నోరి దుర్వాసన పోగొట్టేందుకు మార్కెట్లో మౌత్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి కంటే అద్భుతమైన వస్తువు మన వంటింట్లోనే ఉంది. అదే పసుపు. దీంతో నోటి శుభ్రత సింపుల్ గా చేసుకోవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పసుపు ఆరోగ్యం దగ్గర నుంచి అందం వరకి అన్నింటినీ ఇస్తుంది. దీనితో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. నోటి సంరక్షణ, పరిశుభ్రతకి ఇంతకంటే గొప్ప ఔషధం మరొకటి ఉండదు. పసుపులో కర్కుమిన్ అనే ఆర్గానిక్, నాన్ టాక్సిక్ రసాయన సమ్మేళనం ఉంది. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగానే పసుపు పీరియాంటల్ వ్యాధులు, నోటి క్యాన్సర్‌ల చికిత్సకు అత్యంత ప్రభావవంతమైన పదార్ధంగా మారింది. ఇది మౌత్ వాష్, దంతాల తెల్లబడేలా చేసేందుకు సహకరిస్తుంది. పసుపు కలిపిన నీటితో నోటిని శుభ్రం చేసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
పసుపు నీళ్ళు ఎలా తయారు చేసుకోవాలి?
పసుపు నీటితో నోరు పుక్కిలించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. వాటిని తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు. ఒక గ్లాసు కోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో ½ టీ స్పూన్ పసుపు వేసుకుని 2 చిటికెళ్ల నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. లేదంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకుని అందులో పసుపు వేసి బాగా మరిగించుకోవచ్చు. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు సాధారణ ఉప్పు కొద్దిగా కలుపుకోవచ్చు కూడా. పళ్ళు తోముకున్న తర్వాత ఈ నీటిని పుక్కిలిస్తే నోరు రోజంతా తాజాగా ఉంటుంది.
పసుపు నీళ్ళతో ప్రయోజనాలు
పసుపు నీటిని పుక్కిలించడం వల్ల నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటిలో పుండ్లు ఏవైనా ఉండి తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఈ నీటిని కొద్ది సేపు నోట్లో ఉంచుకుని పుక్కిలించడం వల్ల వారంలోనే అద్భుత ఫలితాలు పొందవచ్చు.
మౌత్ ఫ్రెషనర్ గా
పసుపు నీరు మౌత్ ఫ్రెషనర్ గాను ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన పోగొట్టి మంచి వాసన వచ్చేలా చేయడంలో సహాయపడుతుంది. నోట్లో ఉండే వైరస్, చెడు బ్యాక్టీరియాని చంపుతుంది. చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో ఎక్కువ మంది గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాదు సీజనల్ గా వచ్చే జలుబు, ఫ్లూ బారిన పడినప్పుడు కూడా నిరంతరం గొంతు నొప్పి వేధిస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితితో బాధపడే వాళ్ళకి పసుపు నీళ్ళు ఉపశమనం కలిగిస్తాయి. రోజుకి రెండుసార్లు వీటిని తీసుకోవడం వల్లఅ తక్షణ ఫలితాన్ని అనుభవిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మెరిసే చర్మం కోసం లెమన్ బామ్- ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు