Vidura Niti :  విదురుడు చెప్పిన నీతి వ్యాక్యాలు....



  • తనను పాలించే రాజును, లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు.

  • అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినపుడు కొంత తగ్గి వ్యవహరించడం మంచిది. బలవంతుడితో ముఖాముఖి తలపడడం ముర్ఖుని లక్షణం.

  • ధనము, విద్య, మంచి వంశ చరిత్ర  కలిగి ఉండడం పూర్వ జన్మ సుకృతం. ఇవి మంచి వారికి గౌరవాన్ని, అణుకుకువను కలిగిస్తాయి.  చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తాయి.

  • ఆయుధం ఎదుటివారిని గాయపరచవచ్చు లేదా అది గురితప్పవచ్చు.. అయితే మాట సరిగా లేక పోతే మాత్రం అది ఎదుటి మనిషి కచ్చితంగా గాయపరుస్తుంది. కనుక మాట పెదవి దాటేముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.

  • జీవితంలో విజయం సాధించాలంటే కావల్సిన మొదటి ఆయుధం వ్యూహం. వ్యూహం లేకుండా జీవితంలో ముందుకు సాగలేము.

  • రుచిగా ఉండే ఆహారం పంచుకోకుండా తినడమూ,  అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం, ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు.

  • బలవంతుడై శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు.

  • లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు. ఎట్టి పరిస్థితుల్లో సత్యమార్గాన్ని వదల కూడదు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు.

  • పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు.

  • పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. ఉత్తములైన వారు వీటి జోలికి పోరు.

  • తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువనా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు.

  • అసూయ మించిన రోగం లేదు. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేక పోయినా బాధ పడక తప్పదు. పరుల సంపదకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి.

  • ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడ లేక పోతే ఊరక ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మం, పాపం, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది.. కానీ  మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. శరీరానికి తగిలిన గాయం మాన్పవచ్చు కాని మనసుకు తగిలిన గాయం మానడం కష్టం. కొన్ని సార్లు అసాధ్యం కూడా.

  • ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది.

  • కోపం వస్తే ఆపుకోకపోవడం,  పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణమని విదురుడు చెప్పాడు. 


Also Read: వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏది ఉంటే బాగుంటుందో తెలుసా!


Also Read: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!