Visakha Garjana : మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహిస్తున్న విశాఖ గర్జన ర్యాలీకి భారీ ఎత్తున జనం హాజరయ్యారు. జేఏసీ చేపట్టిన ఈ ర్యాలీకి వైసీపీ మద్దతు తెలిపింది. ఎల్ఐసీ భవనం వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్ లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. విశాఖ గర్జనలో మంత్రులు బొత్స, ధర్మాన, ముత్యాల నాయుడు, రోజా, జోగి రమేష్, విడుదల రజిని పాల్గొన్నారు. స్పీకర్ తమ్మినేని, కొడాలి నాని, పేర్ని నాని ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జేఏసీ నేతలు, వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ర్యాలీ ప్రారంభ సభలో నేతలు మాట్లాడారు.
ఆస్తుల మీద ప్రేమే
విశాఖను పరిపాలన రాజధాని చేయాలని భారీ వర్షంలో వచ్చి మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి కొడాలి నాని. మూడు ప్రాంతాల్లోని ప్రజలు బాగుండాలని వికేంద్రీకరణ చేపట్టామన్నారు. హైదరాబాద్ కోల్పోయి ఎంతో బాధపడ్డామన్నారు. చంద్రబాబు, పవన్ కి ఉత్తరాంధ్రపై ద్వేషం అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో వేల ఎకరాలు భూములు కొన్నారన్నారు. చంద్రబాబు 420 అయితే 210 లోకేశ్ రాజకీయ ఎదుగుదల కోసం జూ.ఎన్టీఆర్ ను వేధిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజల మీద ప్రేమ లేదని కొడుకు. ఆస్తుల మీద ప్రేమే ఉందన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేనను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. వైజాగ్ ను అభివృద్ధి చేసి పరిపాలన రాజధాని చేస్తే వచ్చే రెవెన్యూతో రాష్ట్రాన్ని నడపవచ్చని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.
ఫేక్ రైతుల క్యాట్ వాక్ లు
"సీమలో పుట్టినా ఉత్తరాంధ్రకు మద్దతు ఇస్తున్నాను. అమరావతి ఒక్కటే అభివృద్ధి చేస్తే మిగిలిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది అని సీఎం జగన్ వికేంద్రీకరణ చేపట్టారు. పవన్ కి పెళ్లికి, షూటింగ్ లకు, పోటీ చేయడానికి వైజాగ్ కావాలి. కానీ విశాఖను రాజధాని చేస్తామంటే వద్దు అంటున్నారు. విశాఖ వాసులు విజ్ఞులు కాబట్టి పవన్ కల్యాణ్ ను చిత్తుగా ఓడించారు. మన హక్కు కోసం పోరాడుతుంటే ఫేక్ రైతులతో క్యాట్ వాక్ లు చేయిస్తున్నారు. వారిది రియలెస్టేట్ పోరాటం మనది అభివృద్ధి కోసం పోరాటం. 26 జిల్లాల్లో రైతులు, ప్రజలు ఉన్నారు. వారందరి అభివృద్ధి కోసం వికేంద్రీకరణ. అమరావతి ఉద్యమం చంద్రబాబు తన ఏటీఎమ్ కోసం తీసుకొచ్చేంది"-మంత్రి రోజా
రాజధాని కోసం పోరాటం
"వర్షం ఉరుములు, మెరుపులను కూడా లెక్కచేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ గర్జనలో పాల్గొన్నారు. ఆకలి కోసం ఉత్తరాంధ్రలో సాయుధ పోరాటం జరిగింది. నేడు అదే బాటలో వికేంద్రీకరణ చేపట్టాం. వెనుకుబాటుతనం పోయి అభివృద్ధి బాటలోకి వెళ్లడం కోసం, భావితరాలకు కోసం అవసరమైతే పోరాటం చేస్తాం. విశాఖ రాజధాని అయ్యే వరకు పోరాటం మాత్రం కొనసాగిద్దాం." - స్పీకర్ తమ్మినేని సీతారాం
చంద్రబాబు, పవన్ ను నిలదీయండి
కోట్లు దోచుకోవడానికి అమరావతిని రాజధాని చేశారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అమరావతి పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ ను ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలన్నారు. శాసన రాజధాని ఉత్తరాంధ్ర వాసులు అడ్డుకోవడం లేదు కదా మరి అమరావతి వాసులు ఎందుకు విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నారని నిలదీశాలని సూచించారు. జేఏసీ ఏ కార్యక్రమం చేపట్టినా వైసీపీ మద్దతు ఇస్తుందన్నారు.
జగన్ ఉండగా మనకెందుకు భయం
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు రాకుండా చేసినందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. 130 ఏళ్ల నుంచి వస్తున్న వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఇవాళ గర్జించారన్నారు. భవిష్యత్తులో మరింత గట్టిగా రాజకీయ పోరాటం చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు తమ వాదాన్ని బలంగా దేశం అంతటికీ వినిపించాలని సూచించారు. ఉత్తరాంధ్ర ఆశయం కోసం ముఖ్యమంత్రి, బలమైన నాయకుడు జగన్ ఉండగా మనకెందుకు భయం అని అన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కోసం పోరాడదాం, సాధించుకుందా అని అన్నారు.
పైన ఆకుపచ్చ కండువాలు లోపల పచ్చ కండువాలు- మంత్రి మేరుగు నాగార్జున
మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా, అమరావతి ప్రాంతంలో రైతులను దోచుకుని, 29 గ్రామాల కోసం ఈరోజు చంద్రబాబు ఉద్యమం చేయిస్తున్నారని విమర్శించారు. పైన ఆకు పచ్చ చొక్కాలు లోపల పసుప పచ్చ కండువాలు వేసుకని, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వారంతా పోరాటం చేస్తున్నారన్నారు. మూడు రాజధానులే ఈ రాష్ట్రానికి శరణ్యం అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దు అని చెప్పారు.