Russia Shooting: రష్యా సైనికులపై కాల్పులు- 11 మంది మృతి, 15 మందికి గాయాలు!

ABP Desam   |  Murali Krishna   |  16 Oct 2022 11:37 AM (IST)

Russia Shooting: రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

(Image Source: PTI)

Russia Shooting: ఉక్రెయిన్‌ సరిహద్దులోని బెల్గొరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యా సైనిక శిక్షణ శిబిరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.

ఇదీ జరిగింది

ఉక్రెయిన్‌పై వరుస దాడులు చేస్తోన్న రష్యాకు ఈ ఘటన భారీ షాక్ ఇచ్చింది. సైనిక శిక్షణ కేంద్రంపై ఉగ్ర దాడి జరిగినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మాజీ సోవియెట్ స్టేట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. ఈ కాల్పులు చేసినట్లు తెలిపింది. ఇద్దరు దుండగులను బలగాలు మట్టుబెట్టినట్లు పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

బెల్గొరోడ్‌ ప్రాంతం పశ్చిమ మిలిటరీ డిస్ట్రిక్ట్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై ఇద్దరు దుండగులు అక్టోబర్‌ 15న కాల్పులు జరిపారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌ కోసం వలంటీర్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.                     -  రష్యా రక్షణ శాఖ

పుతిన్ వార్నింగ్

ఉక్రెయిన్‌కు సాయం చేస్తోన్న నాటో కూటమి దేశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ7 దేశాలు ఇటీవల రష్యాకు వార్నింగ్ ఇవ్వడంపై పుతిన్ సీరియస్ అయ్యారు. 

నాటో గుర్తుపెట్టుకో ఏ పరిస్థితుల్లోనైనా ఉక్రెయిన్‌లో మా సైన్యంతో గనుక మీ బలగాలు నేరుగా తలపడితే అది అత్యంత తీవ్రమైన చర్య. తదుపరి పరిణామాలు ప్రపంచ విపత్తుకు దారితీయడం ఖాయం.                                 -  వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

కజకిస్థాన్‌ రాజధాని ఆస్తానాలో జరిగిన ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ దేశాల సమావేశంలో శుక్రవారం పుతిన్‌ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతానికి భారీ దాడుల ప్రణాళికేమీ లేదని, ఆ దేశ వినాశనాన్ని తాము కోరుకోవడం లేదని పుతిన్ అన్నారు. కెర్చ్‌ వంతెన పేల్చివేతను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అలాంటి ఉగ్ర దాడులకు దిగితే మాత్రం ఆహార ధాన్యాల ఎగుమతికి వీలు కల్పించిన 'మానవతా కారిడార్లను' మూసివేస్తామన్నారు. 

జీ7 దేశాలు

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించడంపై జీ7 దేశాలు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోందని మండిపడ్డాయి. పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై కూడా జీ7 దేశాలు తీవ్రంగా స్పందించాయి.

ఉక్రెయిన్ అవసరాలను తీర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా చేస్తోన్న దాడులను జీ7 దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ర‌ష్యా ఎలాంటి ర‌సాయ‌న‌, జీవ‌, అణ్వాయుధాలను వాడినా తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు. ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆర్ధిక‌, సైనిక‌, దౌత్య‌, న్యాయ సాయం అవ‌స‌ర‌మైనా అందించేందుకు, ఆ దేశానికి బాస‌ట‌గా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాం.                                         "
-    జీ7 దేశాలు

Also Read: Biden On Pakistan: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్థాన్ - జో బైడెన్

Published at: 16 Oct 2022 10:36 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.