Pakistan PM on Biden: 'మాది బాధ్యత గల దేశం'- జో బైడెన్‌ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని

ABP Desam   |  Murali Krishna   |  16 Oct 2022 01:41 PM (IST)

Pakistan PM on Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల పాక్‌పై చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్ గట్టిగా వస్తుంది.

'మాది బాధ్యత గల దేశం'- జో బైడెన్‌ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని

Pakistan PM on Biden: "ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్" అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. దశాబ్దాలుగా అణ్వాయుధాల విషయంలో పాక్‌ అత్యంత బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరించిందన్నారు. 

నేను నిస్సందేహంగా చెబుతున్నాను. పాకిస్థాన్ బాధ్యతాయుతమైన అణు దేశం. అంతర్జాతీయ అణుశక్తి (ఐఏఈఏ) అవసరాలకు అనుగుణంగా మా అణ్వాయుధాలకు అత్యుత్తమ రక్షణ వ్యవస్థ ఉంది. దీనికి మేము గర్విస్తున్నాం. మేము ఈ భద్రతా చర్యలను అత్యంత సీరియస్‌గా తీసుకుంటాం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు వద్దు. -                                   షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ప్రధాని

ఇమ్రాన్ ట్వీట్

బైడెన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించారు.

బైడెన్‌ దేన్ని ఆధారం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అణ్వాయుధీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో పాల్గొన్న అమెరికాలా.. పాకిస్థాన్ ఎప్పుడు దూకుడుగా వ్యవహరించింది?                                   - ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని

బైడెన్ ఏమన్నారంటే?

లాస్ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. పాకిస్థాన్‌పై ఫైర్ అయ్యారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి. ప్రపంచ దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండానే పాక్‌ అణ్వాయుధాలను కలిగి ఉంది.                                     - జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు 

రష్యా ఉక్రెయిన్‌ ఆక్రమణపైనా ఈ సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు బైడెన్. ప్రపంచ దేశాలపైనే కాకుండా అమెరికాకు మిగతా దేశాలకున్న సత్సంబంధాలను ఈ యుద్ధం చెడగోడుతోందని అన్నారు. అటు చైనాతో సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు. "చైనాతో మళ్లీ చేయి కలిపి పాత బంధాన్ని పునరు ద్ధరించే బాధ్యతను బరాక్ ఒబామా నాకు అందించారు" అని కామెంట్ చేశారు.

Also Read: Xi Jinping Third Term: వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్- ఈ సారి టార్గెట్ తైవాన్!

Published at: 16 Oct 2022 01:35 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.