మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ విడుదలకు సిద్ధమైంది. విష్ణుకు ఇది తొలి పాన్ ఇండియా మూవీ. అక్టోబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘జిన్నా’ రిలీజ్ అవుతోంది. ఇప్పటికు విష్ణు తన సినిమా ప్రమోషన్స్ కోసం ముంబయి, కోచి తదితర నగరాలు చుట్టేశారు. అయితే, ఈ చిత్రాన్ని కొరియా, చైనా, జపాన్ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారా? దీనిపై మంచు విష్ణు ఏమన్నారు?
ఇటీవల మంచు ఫ్యామిలీని ట్రోలర్స్ తెగ ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ‘మా’ ఎన్నికలు ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ రిలీజ్ నుంచి మంచు విష్ణు, మోహన్ బాబుపై ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ట్రోలర్స్‌పై కేసులు పెడతామని మంచు విష్ణు హెచ్చరికలు జారీచేసినా ఎవరూ తగ్గకుండా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. చెప్పాలంటే, విష్ణు వార్నింగ్ తర్వాత ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఇప్పుడు జిన్నా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మరోసారి విష్ణును ట్రోల్స్ చేసేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం విష్ణును ఆటపట్టించే కామెంట్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ‘జిన్నా’ మూవీని కొరియా, చైనా, జపాన్ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారా? అని ప్రశ్నించాడు. ఇందుకు విష్ణు కూడా తగిన జవాబే చెప్పారు.
‘‘అవును, ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసి మీరు విడుదల చేస్తారా?’’ అని సమాధానం ఇచ్చారు. అలాగే మరికొందరు అడిగిన ప్రశ్నలకు కూడా మంచు విష్ణు ట్వీట్టర్‌లో సమాధానం ఇచ్చారు. ‘‘భవిష్యత్తులో మంచు ఫ్యామిలీ అంతా కలిసి మల్టీస్టారర్ మూవీ చూస్తారా?’’ అని అడిగిన ప్రశ్నకు.. విష్ను ‘‘ఉండవచ్చు’’ అని సమాధానం ఇచ్చారు. ‘‘మీరు చిరంజీవిని అనవసరంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అని అడిగితే.. ‘‘నేను ఎప్పుడు చేయలేదు. అలా చేయను కూడా’’ అని విష్ణు బదులిచ్చారు. తన తర్వాతి ప్రాజెక్ట్ దర్శకుడు శ్రీను వైట్లతో ఉంటుందని విష్ణు తెలిపారు. అసెంబ్లీ రౌడీ మూవీ రీమేక్‌పై స్పందిస్తూ.. ఇప్పట్లో దాని గురించి ఏమీ చెప్పలేనని విష్ణు పేర్కొన్నారు.
‘జిన్నా’ మూవీకి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. రక్షిత్ మాస్టర్ ఈ మూవీకి కొరియోగ్రాఫర్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇదొక హారర్ కామెడీ సినిమా అని, 'చంద్రముఖి' తరహాలో ఉంటుందని విష్ణు మంచు తెలిపారు. ఇందులో సన్నీ లియోన్, పాయల్ హీరోయిన్లు.
‘జిన్నా’ ట్రైలర్:
ట్రోల్స్‌పై విష్ణు స్పందన: కొన్ని రోజులుగా తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విష్ణు మంచు ఇటీవల స్పందించారు. ఉద్దేశపూర్వకంగా తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు ట్రోల్స్ చేయిస్తున్నారని ఆ మధ్య ఆయన పేర్కొన్నారు. తాను ఊహించినట్టుగా 'జిన్నా' విడుదలకు ముందు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారని విష్ణు మంచు ట్వీట్ చేశారు. విష్ణు ట్రోల్స్‌పై స్పందించడానికి కారణం.. ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ. ఈ టీజర్ కొన్ని రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్‌లో టీజర్ విడుదల అయిన తర్వాత ఆడియన్స్ ట్రోల్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే... విష్ణు మంచు ఆ టీజర్ మీద కామెంట్స్ చేసినట్లు కొందరు మీమ్ మేకర్స్ పోస్టులు చేస్తున్నారు. ''ప్రభాస్, 'ఆదిపురుష్' దర్శక నిర్మాతలు చీట్ చేశారు. 'ఆదిపురుష్' టీజర్‌లో విజువల్స్ కార్టూన్స్‌లా ఉన్నాయి. ఇటువంటి సినిమా తీసే ముందు ప్రేక్షకులను ప్రిపేర్ చేయాలి. అలా కాకుండా చీటింగ్ చేస్తే ఇటువంటి రియాక్షన్స్ వస్తాయి'' అని విష్ణు మంచి వ్యాఖ్యానించినట్టు పోస్టులు చేశారు. అటువంటి పోస్ట్ ఒకటి ట్వీట్ చేసిన ఆయన... అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు.