Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 12 మంది అభ్యర్థులతో కూడిన ఐదవ జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆదివారం విడుదల చేసింది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.






ఐదవ జాబితాతో కలిపి ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 53 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు ఇప్పటి వరకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు.


దూకుడుగా


గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు షాక్ ఇవ్వాలని ఆమ్‌ ఆద్మీ వ్యూహాలు రచిస్తోంది. ఆప్‌ను గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని కేజ్రీవాల్ అన్నారు. పలు హామీలు ప్రకటించారు.



  • 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.

  • రాబోయే ఐదేళ్లలో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం కల్పిస్తాం

  • అందరికీ ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి

  • 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కల్పిస్తాం. 

  • ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ప్రశ్నాపత్నం లీక్ కాకుండా చూడటంతో పాటు ఇందుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక చట్టం తీసుకువస్తాం.


2017లో


గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.


ABP- C ఓటర్ సర్వే


ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్‌ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై ABP News,C Voter Opinion Poll నిర్వహించింది. ఈ పోల్‌లో గుజరాత్‌లో మరోసారి భాజపా విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది భాజపా. ఇప్పుడు ఏడోసారి కూడా గెలుస్తుందని ఈ పోల్‌లో తేలింది.


మొత్తం 182 స్థానాల్లో భాజపా 135-143 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఆప్‌ రేసులోకి రావడం వల్ల భాజపా, కాంగ్రెస్ ఓటు శాతం తగ్గిపోతుందని తెలిపింది. భాజపాకు 46.8%, కాంగ్రెస్‌కు 32.3%, ఆప్‌నకు 17.4% ఓట్లు దక్కుతాయని అంచనా వేసింది ABP News,C Voter Opinion Poll 2022. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 36-44 సీట్లు వస్తాయని, ఆప్‌ సున్నా లేదంటే 2 సీట్లు మాత్రమే సాధించే అవకాశముందని వెల్లడించింది. 


Also Read: PM-KISAN Yojana: రైతులకు గుడ్‌న్యూస్- ఆ రోజు 'పీఎం కిసాన్' నిధులు విడుదల!