రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఉప్పల్‌లో ఉన్నట్టుండి సంచలనం రేపిన బ్రాహ్మణులైన తండ్రీ కొడుకుల జంట హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు పోలీసుల విచారణ ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని ముమ్మర విచారణ చేయగా, స్థిరాస్తి విషయం, కుటుంబ గొడవలు, కోర్టు కేసులు ఈ హత్యకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. నిందితులను 12 ప్రత్యేక పోలీస్ టీమ్‌లు పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, కచ్చితమైన కారణం కోసం పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో నిందితులను పట్టుకొని తీరతామని పోలీసులు చెబుతున్నారు.
హత్య కోసం పక్కాగా రెక్కీ
నిందితులు హత్య చేసేందుకు ముందు పక్కా ప్రణాళిక రచించికుకున్నట్లుగా తెలుస్తోంది. హత్యకు ఏ సమయం అనుకూలంగా ఉంటుంది. జన సంచారం ఎప్పుడు తక్కువ, అనే విషయంలో పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన నరసింహ శర్మ ఇంటి వద్దే ఉంటూ తెలిసిన వ్యక్తులకు జాతకాలు, పంచాంగం చెబుతుంటారు. ఉదయం 6.30 నుంచి సాయంత్రం వరకూ చాలా మంది వచ్చి వెళ్తుంటారు. ఉదయం 5-6 గంటల సమయంలో ఎవరూ ఉండరని హత్య కోసం ఆ సమయం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం ఘటన జరగడానికి ముందు 5 గంటల ప్రాంతంలో పని మనిషి వచ్చి నరసింహ శర్మ ఇంట్లో పని చేస్తోంది. ఆ వెంటనే పూలమ్మే వ్యక్తి వచ్చాడు. పూలు ఇచ్చి తిరిగివెళ్లాక గేటు తెరిచే ఉంది. ఇదంతా గమనించిన ముగ్గురు దుండగులు వెంటనే ఇంట్లోకి ప్రవేశించి దారుణంగా హత్య చేశారు.
పోలీసుల అదుపులో హాస్టల్ నిర్వాహకులు
పోలీసులు మొత్తం 12 టీమ్‌లతో రంగంలోకి దిగగా, ఇప్పటికి బంధువులు, స్థానికులతోపాటు అనుమానం ఉన్న 40 మందిని ప్రశ్నించారు. తరచూ జాతకాల కోసం వచ్చి వెళ్లే వారి వివరాలు.. హత్య అనంతరం నిందితులు ఎటువైపు ఏ వాహనంలో వెళ్లారో తెలుసుకునేందుకు 10 కి.మీ. పరిధిలోని సుమారు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు చూశారు. హత్యకు ముందు వారంతా ఓ స్థానిక హాస్టల్ నుంచి వచ్చినట్లు నిర్ధారించారు. ఆ హాస్టల్ నిర్వహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
పని చేయని సీసీటీవీ కెమెరా
వీరు ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించుకున్నారు. అయితే, అవి గత 10 రోజుల నుంచి పనిచేయట్లేదు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే దాన్ని పనిచేయకుండా చేశారా? లేదంటే పాడైందా అనేది కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. కక్ష కట్టిన నిందితులు స్వయంగా హత్య చేశారా? లేక సుపారీ గ్యాంగ్ చేసిందా అనే కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.