PM-KISAN Yojana: దేశ రాజధాని దిల్లీలో రెండు రోజుల పాటు పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 సదస్సు జరగనుంది. అక్టోబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం వేదికగా రైతుల ఖాతాల్లోకి 12వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని విడుదల చేయనున్నారు.
రూ.2 వేలు
కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.16 వేల కోట్లు విడుదల చేయనున్నారు మోదీ. దీంతో రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.2వేల చొప్పున జమకానున్నాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
పేదలైన అన్నదాతలను ఆదుకొనేందుకు నరేంద్రమోదీ సర్కారు ప్రవేశపెట్టిన పథకం పీఎం కిసాన్ యోజన! ఈ స్కీమ్‌లో చేరిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.6000ను పెట్టుబడి సాయంగా అందజేస్తుంది. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్యలో తొలి విడత నిధులు విడుదల చేస్తారు. ఆగస్టు 1-నవంబర్ 30 మధ్య రెండో విడత పంట సాయం అందిస్తారు. డిసెంబర్ 1-మార్చి 31 మధ్య చివరి విడత డబ్బులు బదిలీ చేస్తారు.
బలపడుతున్న రైతులు
రైతుల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్యే ఓ ట్వీట్ చేశారు. 'మన రైతు సోదరసోదరీమణులను చూసి దేశం గర్విస్తోంది. వారెంత సమృద్ధిని సాధిస్తే దేశం అంత పటిష్ఠంగా మారుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సహా వ్యవసాయ సంబంధ పథకాలు రైతులకు అంతులేని బలాన్ని అందిస్తున్నాయి' అని పోస్టు చేశారు.
పథకంలో చేరేందుకు ఏయే పత్రాలు కావాలంటే..
- లబ్ధిదారులకు రెండు హెక్టార్లకు మించి భూమి ఉండొద్దు.
- భూమి యాజమాన్యం పత్రాలు
- ఆధార్ కార్డు
- గుర్తింపు కార్డు
- డ్రైవింగ్ లేదా ఓటర్ ఐడీ
- బ్యాంక్ ఖాతా పుస్తకం
- మొబైల్ ఫోన్ నంబర్
- చిరునామా
- భూమి పరిమాణం సహా వివరాలు
- ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
- ముందుగా మీరు పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- తర్వాత రైతుల కార్నర్ కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి.
- 'కొత్త రైతు నమోదు' ఎంపికపై క్లిక్ చేయాలి.
- తరువాత, ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి.
- దీనితో పాటు, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి.. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత ముందుకు వెళ్లాలి.
- ఈ ఫారమ్‌లో మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి
- బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పొలానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి.
- ఆ తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించవచ్చు.
ఇలా చెక్ చేసుకోవాలి
పీఎం కిసాన్ లబ్ధిదారుడు తన ఖాతాలో డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న 'లబ్ధిదారుని స్థితి' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తరువాత విండో తెరుచుకోగానే.. ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.. ఎంటర్ చేయాలి. అలా ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘'డేటాను పొందండి'’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా ఇక్కడ కనిపించే ‘'పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయొచ్చు.
Also Read: Pakistan PM on Biden: 'మాది బాధ్యత గల దేశం'- జో బైడెన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని