Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి ఓ వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ నిర్ణయించుకున్నారు.


సోనియా ఓకే


ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని థరూర్ ఆమె ముందు ఉంచగా.. "మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు" అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. 


అయితే అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా తాను మాత్రం వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్‌ ప్రకటించారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు చేపట్టాలని థరూర్ ఎప్పటి నుంచో కోరుతున్నారు.  


గహ్లోత్


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ కూడా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పటికే ఖాయమైంది. దేవీ నవరాత్రులు మొదలయ్యాక సెప్టెంబర్ 26న ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 30 తుది గడువు. అక్టోబర్‌ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు వెల్లడవుతాయి. ఒక వేళ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో గహ్లోత్ నెగ్గితే రాజస్థాన్ సీఎం పగ్గాలు సచిన్‌ పైలట్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.


రాహుల్ సంగతేంటి?


మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాహుల్ గాంధీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. అధ్యక్ష ఎన్నికలపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఎవ‌రు ఉంటార‌ని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ ఇలా సమాధానమిచ్చారు.


" నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎన్నికలు జరిగితే నా నిర్ణయం స్పష్టమవుతుంది. నేను అధ్యక్ష పదవిని చేపట్టేది, లేనిది స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూడాలి. ఈ విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను.                                                     "




-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత



మరోవైపు రాహుల్‌ గాంధీయే మళ్లీ అధ్యక్షుడు కావాలంటూ ఆరు పీసీసీ కమిటీలు తీర్మానం చేశాయి.


Also Read: Uttar Pradesh News: బాత్రూమ్‌లో భోజనాలు- కబడ్డీ ప్లేయర్లకు ఘోర అవమానం!



Also Read: Jodhpur News: కన్నతండ్రిని కర్రతో చావబాదిన కుమారుడు- వైరల్ వీడియో!