Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు సీనియర్ నేతలు.. దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ సమావేశమయ్యారు. నామపత్రాలు స్వీకరించిన అనంతరం దిగ్విజయ్ సింగ్.. శశిథరూర్​ను కలిశారు.


అధ్యక్ష పదవికి దిగ్విజయ్ పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు థరూర్ తెలిపారు. ఇది ఇద్దరి మధ్య పోరాటంగా కాకుండా.. స్నేహపూర్వక పోటీగానే ఉండాలని ఇరువురూ అంగీకరించుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లేనని థరూర్ ట్వీట్ చేశారు.


గహ్లోత్ ఔట్


 కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తప్పుకున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. దిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం తర్వాత అశోక్ గహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు.



కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నేను మాట్లాడాను. రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాలు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. నేను సీఎంగా ఉండాలనే ఇదంతా జరిగిందనేలా వాతావరణం మారింది. ఇందుకు సోనియా గాంధీకి నేను క్షమాపణ చెప్పాను. నేను కొచ్చిలో రాహుల్ గాంధీని ఇటీవల కలిశాను. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని అభ్యర్థించాను. ఆయన అంగీకరించక పోవడంతో నేను పోటీ చేస్తానని చెప్పాను. కానీ తాజా పరిణామాల తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను                                     "
-అశోక్ గహ్లాత్, రాజస్థాన్ సీఎం 


డిగ్గీ రాజా X శశిథరూర్


కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి గహ్లోత్ ఔట్ అవడంతో ఈ పదవికి ఎవరెవరు పోటీ చేస్తున్నారనే దానిపై స్పష్టత వచ్చింది. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ బరిలో ఉండటం ఖాయం కాగా ఆయనతో మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.


అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు దిగ్విజయ్ ఇప్పటికే ప్రకటించారు. నామినేషన్ పేపర్లను కూడా తీసుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ రేసు నుంచి తప్పుకోవడంతో దిగ్విజయ్, శశిథరూర్ మధ్యే పోటీ నెలకొంది.


ముఖ్యమైన తేదీలు



  • నామినేషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 30

  • నామినేషన్ పత్రాల పరిశీలన: అక్టోబర్‌ 1

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 8

  • ఓటింగ్‌:  అక్టోబర్‌ 17

  • ఫలితాలు: అక్టోబర్ 19





Also Read: Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్


Also Read: Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!