Bharat Jodo Yatra:


మహారాష్ట్రలో జోడో యాత్ర


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ యాత్ర పూర్తికాగా ఇప్పుడు మహారాష్ట్రలో కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే..హింగోలి జిల్లాలోని కలమ్‌నురి ప్రాంతంలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్‌పై డ్రమ్స్ వాయిస్తున్న కళాకారుల వద్దకు వెళ్లి తానూ కాసేపు డ్రమ్స్ వాయించారు. ఆ తరవాత ఆ కళాకారులకు షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకున్నారు.









ఆ తరవాత కాంగ్రెస్ మాజీ ఎంపీ దివంగత నేత ఎంపీ రాజీవ్ సతవ్‌కు నివాళులర్పించారు. ఆదివారం విశ్రాంతి తీసుకుని మళ్లీ ఇవాళ కలమ్‌నురి ప్రాంతం నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. వశిమ్ ప్రాంతం వరకూ ఇది కొనసాగనుంది. ఇప్పటికే కలమ్‌నురిలో భారీ బహిరంగ సభ జరిగింది. "దేశంలో విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు, వాటిని అడ్డుకోవటమే భారత్ జోడో యాత్ర లక్ష్యం" అని వెల్లడించారు. భారత్‌ను విడదీయడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. మహారాష్ట్రకు రావాల్సిన Vedanta-Foxconn, టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్‌లను ఎన్నికల కోసం గుజరాత్‌కు మళ్లించారని ఆరోపించారు. ఇక..భారత్ జోడో యాత్రలో రాహుల్ అందరితోనూ మమేకమవుతున్న తీరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ..అందరినీ కలుస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు రాహుల్. అంతకు ముందు తెలంగాణలో పర్యటించిన సమయంలో ధింసా నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాక, పోతురాజులను కూడా రాహుల్ కలిశారు. వారి వద్ద ఉన్న కొరడా తీసుకొని సరదాగా తనను తాను రాహుల్ గాంధీ కొట్టుకున్నారు. రోడ్‌పైనే ఓ బాలుడితో క్రికెట్ ఆడుతూ అలరించారు. ఆ వీడియో సోషల్మీ డియాలో షేర్ చేశారు. 


తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు..


అంతకు ముందు తెలంగాణలో భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్...తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "దశాబ్దాలు శ్రమించి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరిస్తున్నారు. వేల కోట్ల విలువైన భూముల కోసమే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరిస్తున్నారు. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్ తో సీఎం కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారు. రైతు వ్యతిరేక చట్టానికి పార్లమెంటులో బీజేపీకి టీఆరెస్ సహకరించింది. బీజేపీ, టీఆరెస్ కలిసి పనిచేస్తున్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జోడో యాత్ర చేపట్టాం. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే యాత్ర లక్ష్యం" అని రాహుల్ స్పష్టం చేశారు. 


Also Read: BJP Shinde Sena Alliance: ఏ ఎన్నికలైనా సరే కలిసి నడుస్తాం, శిందే శివసేనతో పొత్తుపై బీజేపీ ప్రకటన