Karnataka High Court: నచ్చిన వ్యక్తులతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోతే మోసం చేసినట్లు కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. సదరు వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ నేతృత్వలోని సింగిల్ జడ్జి బెంచ్ వెల్లడించింది. అయితే ఎనిమిదేళ్లుగా తనను ప్రేమంచి సహజీవనం చేసిన ప్రియుడు తనను పెళ్లి చేసుకోనని చెప్పాడంటూ ఓ మహిళ 2020వ సంవత్సరం మే 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిది. అయితే సదరు వ్యక్తిపై అతని కుటుంబ సభ్యులపై ఈ ఫిర్యాదును కొట్టివేస్తూ.. కర్ణాటక ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఇద్దరి మధ్య ఉన్న సహజీవనం ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భగా న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. ఇంట్లో వాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదర్చిన కారణంగా.. సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు.
సహజీవనంలో పిల్లలు పుడితే.. పూర్వీకుల ఆస్తిపై పిల్లలకు హక్కు!
సహజీవనం చేస్తున్న హిందూ జంటలకు పుట్టిన పిల్లలకు కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుందని సుప్రీంకోర్టు ఐదు నెలల క్రితమే తెలిపింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. వివాహం చేసుకోకుండా సహజీవనం చేసే జంటల పిల్లలు కుటుంబ ఆస్తిలో వాటా పొందలేరన్న కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. పెళ్లి చేసుకోకుండా చాలా కాలం కలిసి ఉన్న జంటలకు పుట్టిన పిల్లలకు కుటుంబ ఆస్తిలో వాటా లభిస్తుందని సుప్రీం కోర్టు ఇటీవలే ఇచ్చిన తీర్పులో పేర్కొంది. పిటిషన్ లో పేర్కొన్న పురుషుడు, మహిళ చాలా కాలంగా సహజీవనం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని వివాహితుల్లాగే వారి సంబంధాన్ని కొనసాగించారని చెప్పింది. అందువల్లే వారి వారసులకు పూర్వీకుల ఆస్తిలో న్యాయమైన వాటా లభిస్తుందని ఈ కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
అలాగే సహ జీవనంలో శృంగారం చేస్తే అత్యాచారం కాదు..
అలాగే పరస్పర అంగీకారంతో కూడిన శృంగారానికి, అత్యాచారానికి మధ్య తేడా ఉంది. సహజీవన భాగస్వామి ఇతరత్రా కారణాలతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాధితురాలు అత్యాచారం చేశారని అంటే అది చట్ట ప్రకారం నేరం కిందకు రాదని మాహరాష్ట్ర హైకోర్టు రెండేళ్లు క్రితం తెలిపింది. ఇద్దరూ కలిసే ప్రేమలో పడి.. ఇష్టంగా సహజీవనం చేయండాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
సహజీవనం, హక్కులు..
పెళ్లి చేసుకోకుండా, ఎలాంటి బాధ్యతలు తీసుకోకుండా స్త్రీ, పురుషులు కలిసి జీవించడమే సహజీవనం అని అనుకుంటారు అంతా. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారం, ఇష్టంతోనే సహజీవనం కొనసాగుతుంది. ఈ బంధంలో ఎలాంటి సామాజిక కట్టుబాట్లు, చట్టపరమైన హక్కులు కానీ ఉండవు. ఈ క్రమంలోనే ఇలాంటి స్థితిలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉటే దానిని అత్యాచారంగా పరిగణించరు. సుప్రీం కోర్టు కూడా ఇదే విషయమై స్పష్టతను ఇచ్చింది.