Punjab Earthquake:  ఉత్తర భారతదేశం భూ ప్రకంపనలతో వణికిపోతోంది. పంజాబ్ లో సోమవారం వేకువజామున కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1 గా నమోదైందని సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.


అమృత్ సర్ సమీపంలో తెల్లవారు జామున 3 గంటల 40 నిమిషాలకు సుమారు 120 కిలోమీటర్ల మేర భూమి కంపించిందని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో జనం భయంతో బయటకు వచ్చి రాత్రంతా జాగారం చేశారు. గత వారం రోజుల్లో ఉత్తర భారతంలో భూకంపం రావడం ఇది మూడోసారి. 


బుధ, శనివారాల్లో దిల్లీ, ఇతర ప్రాంతాల్లో భూమి కంపించింది. నవంబర్ 9న దిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో, నవంబర్ 10న ఉత్తర భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అయితే తక్కువ తీవ్రతతో వస్తున్న ప్రకంపనల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. 


నేపాల్ లో భూకంపం.. ఉత్తర భారతంలో ప్రభావం


ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతంలో నవంబర్ 8న భూకంపం సంభవించింది. అంతకుముందు పొరుగు దేశం నేపాల్ లో వచ్చిన భూకంప తీవ్రత  రిక్టర్ స్కేలుపై  6.3గా నమోదుకాగా.. ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి. వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం పొరుగు దేశం నేపాల్ అని గుర్తించారు. భూకంపం యొక్క ప్రకంపనలు దాదాపు ఒక నిమిషం పాటు వచ్చినట్లుగా స్థానికులు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ సహా దాని పరిసర ప్రాంతాలతో పాటు, యూపీ-ఉత్తరాఖండ్, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అయితే నేపాల్‌లో ఈ భూకంపం వల్ల ఆరుగురు చనిపోయినట్లుగా తెలుస్తోంది.


భూకంపం సంభవించినట్లయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి


భూకంపం సంభవించినప్పుడు మీరు సురక్షితమైన ప్రదేశంలో ఉండటం చాలా ముఖ్యం. భూకంపం కారణంగా భవనాలు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. భూకంపాల వల్ల సంభవించిన మరణాలన్నీ భవన శిథిలాల కింద సమాధి కావడం వల్లనే అవుతుంటాయి. అటువంటి పరిస్థితిలో, భూకంపం సమయంలో మీరు సురక్షితమైన ప్రదేశంలో ఉండటం ముఖ్యం. భూకంపం సమయంలో మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.


మీరు ఇంటి లోపల ఉంటే
మీరు భూకంపం సమయంలో ఇంటి లోపల ఉంటే ఒక దృఢమైన టేబుల్ లేదా ఏదైనా ఫర్నిచర్ కింద వెళ్లి కూర్చోవాలి. ఇంట్లో టేబుల్ లేదా డెస్క్ లేకపోతే, మీ ముఖం, తలపై మీ చేతులతో కప్పి, భవనంలో ఒక మూలలో కూర్చోండి. ఒక టేబుల్ లేదా బెడ్ కింద, గది మూలలో ఉండొచ్చు. భూకంపం సమయంలో గాజులు, కిటికీలు, తలుపులు, గోడలకు దూరంగా ఉండండి. పడే వస్తువుల చుట్టూ ఉండకండి.


మీరు ఇంటి నుండి బయట ఉంటే
మీరు ఇంటి వెలుపల ఉంటే, మీరు ఉన్న చోట ఉండండి. భవనాలు, చెట్లు, వీధి దీపాలు,  విద్యుత్/టెలిఫోన్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండండి. మీరు బహిరంగ ప్రదేశంలో ఉంటే, భూకంపం యొక్క ప్రకంపనలు ఆగే వరకు అక్కడే ఉండండి. బహిరంగ ప్రదేశానికి వెళ్లి నిలబడటం మంచిది.