Rajiv Gandhi Murder Case : నేను కుటుంబంతో కలిసి ఉండాలి. ముఫ్పై రెండేళ్లుగా నేను వాళ్లకు దూరంగా ఉన్నాను. భర్తతో కలిసి ఉంటాను. ఇదీ 32 సంవత్సరాల తర్వాత తమిళనాడు జైలు నుంచి విడుదలైన నళినీ శ్రీహరన్ చెప్పిన మాటలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆమె నిందితురాలిగా ఇన్ని సంవత్సరాలు జీవిత ఖైదును అనుభవించారు. తొలుత మరణశిక్ష పడినా..ఆ తర్వాత జీవితఖైదుగా మారి...ఇప్పుడు ఆమెతో మరో ఆరుగురు నిందితులు విడుదలై తన ఇంటికి చేరుకున్నారు. ఈ చర్యను ఖండిస్తున్న వాళ్లు..సమర్థిస్తున్న వాళ్లు ఇద్దరూ ఉన్నారు.


అసలేం జరిగింది? 


 అసలు రాజీవ్ గాంధీ హత్య ఎలా జరిగింది. మళ్లీ ప్రధానిగా గెలిచి సంచలన నిర్ణయాలు తీసుకుంటారన్న టైంలో రాజీవ్ గాంధీని హత్య చేయాలని భావించిందెవరు. ముఫ్పై రెండేళ్ల క్రితం అసలేం జరిగింది.  మే 21, 1991  శ్రీ పెరంబదూరు, తమిళనాడు "Relax, don't worry, తనను కలవటానికి ముందుకు వస్తుండగా అడ్డుకుంటున్న పోలీసులకు రాజీవ్ గాంధీ చెప్పిన ఆఖరు మాటలు. అప్పటికి ఆయన అధికారంలో లేరు. కానీ కచ్చితంగా రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పటి నేషనల్ ఫ్రంట్ తరపున దేశ ప్రధానిగా ఉన్న వీపీ సింగ్ కు బీజేపీ నుంచి అసమ్మతి పోరు ఉంది. అలాంటి టైంలో శ్రీపెరంబుదూరులో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేయటానికి వచ్చిన రాజీవ్ గాంధీ...అక్కడ పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా ఉంచిన గ్యాలరీల్లో ప్రజలను కలిసి మాట్లాడారు. పురుషుల వరుసలో ఉన్నవారిని పలకరించి  స్త్రీల గ్యాలరీ వైపు వెళ్తున్న రాజీవ్ వైపు ఓ మహిళ దూసుకు వచ్చింది. ఆమెను అక్కడే ఉన్న ఓ మహిళా పోలీస్ అడ్డుకున్నారు. అయితే మహిళా పోలీస్ ను రాజీవ్ గాంధీ సున్నితంగా వారించారు. కొన్ని క్షణాలు గడిచాయో లేదో ఒక్కసారిగా బాంబు పేలుడు...రాజీవ్ గాంధీ సహా మొత్తం 14 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఏ మహిళను అయితే తనను కలనివ్వాలని రాజీవ్ గాంధీ పోలీసులను వారించారో...ఆమె చేసిన ఆత్మాహుతి దాడితో రాజీవ్ గాంధీ తుది శ్వాస విడిచారు.



ఎల్టీటీఈ పనే


అప్పటికి రాజీవ్ గాంధీ వయస్సు కేవలం 40 సంవత్సరాలు. అతి చిన్నవయస్సులోనే అప్పటికే దేశ ప్రధానిగా సేవలందించి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వాటిలో ఒకటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్. IPKF గా పిలుచుకునే ఈ సైన్యాన్ని శ్రీలంకకు పంపిస్తూ రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం..లంకలోని తిరుగుబాటు దళం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం..LTTE కి ఆగ్రహం తెప్పించింది. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటికే రెబల్స్ గా మారిన LTTE లు భారత సంతతికి చెందిన వారే కావటంతో తమ దేశానికి చెందిన ప్రజల తరపున మద్దతుగా నిలబడాల్సిన రాజీవ్ శ్రీలంక ప్రభుత్వం కోసం సైన్యం పంపించారని LTTE చీఫ్ ప్రభాకరన్ భావించాడు.  వాస్తవానికి లంక అధికారులకు సహాయం అందించటానికి వెళ్లిన IPKF దళాలు..ఆ తర్వాత కౌంటర్ ఇన్ సర్జెన్సీ, ఆ తర్వాత LTTE పై సింహళ ప్రభుత్వం చేపట్టిన యుద్ధంలోనూ పాలుపంచుకున్నాయి. 1990 తర్వాత IPKF కథ ముగిసినా...తిరిగి రాజీవ్ గాంధీ ప్రధాని అయితే మళ్లీ అలాంటి నిర్ణయాలు శ్రీలంకలో తమ ఉనికికే ఇబ్బంది అని LTTE భావించింది. సో రాజీవ్ గాంధీ ప్రాణాలతో ఉండకూడదని భావించిన LTTE 1990 నవంబర్ జాఫ్నా నుంచే పథక రచన ప్రారంభించింది. 


హత్యకు ముందు రెండు డ్రైరన్స్ 


ధను అనే ఉమెన్ సూసైడ్ బాంబర్ తో ప్లాన్ పూర్తి చేయాలని భావించారు. కానీ రాజీవ్ గాంధీ హత్యకు ముందు రెండు డ్రై రన్స్ జరిగాయి. మొదటి అన్నాడీఎంకే అప్పటి అధినేత జయలలిత పొలిటకల్ ర్యాలీ లో నిందితులంతా పాల్గొన్నారు. రెండోసారి ఇంకొంచెం సెక్యూరిటీ ఉండే చోటుకు వెళ్లారు. ఈసారి ఏకంగా ప్రధాని వీపీ సింగ్ సభలోనే పాల్గొన్నారు. ఈ సారి ధను వీపీ సింగ్ పాదాలకు నమస్కారం చేసింది. ఫలితంగా సెక్యూరిటీ బ్రీచింగ్ మీద వాళ్లకో అవగాహన వచ్చింది. 1990 మే 21 న వాళ్లు అనుకున్న రోజు వచ్చింది. రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూరులో జరిగిన క్యాంపెనెయింగ్ నిర్వహించారు. ధను ఆ మీటింగ్ కు బాంబులు చుట్టిన జాకెట్ తో వెళ్లటం...క్షణాల్లో ఆత్మాహుతి చేసుకోవటం....రాజీవ్ గాంధీతో పాటు 14 మంది అక్కడిక్కడే చనిపోవటం క్షణాల్లో జరిగిపోయాయి. ఎయిర్ లిఫ్ట్ చేసి రాజీవ్ గాంధీ పార్ధివదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి అక్కడే పోస్ట్ మార్టమ్ చేశారు. 


తొమ్మిది మందిలో నళిని మాత్రమే 


రాజీవ్ గాంధీ హత్యకు పాల్పడిన కోర్ గ్రూప్ మొత్తం ధను సహా మొత్తం 9 మంది ఉన్నట్లు విచారణలో తేలింది. మిగిలిన వాళ్లు శివరసన్, మురుగన్, అరివు, శుభతో పాటు భాగ్యనాథన్, నళిని, పద్మ అనే స్థానికులు కూడా హత్యకు ప్లాన్ చేసిన వాళ్లలో ఉన్నట్లు తేలింది. హత్య జరిగిన ప్రదేశంలో ధనుతో పాటు శివరసన్, నళిని, శుభ, హరిబాబు వెళ్లారు. హరిబాబు అనే వ్యక్తి 21 ఏళ్ల ఫోటోగ్రాఫర్. హత్య చేసే ముందు ఆఖరి ఫోటోలను తీసింది అతనే. మొత్తం ఈ గ్రూపులో నలుగురు ఘటనలో చనిపోయారు. తొమ్మిది మందిలో నళినిని మాత్రమే ప్రాణాలతో పోలీసులు పట్టుకోగలిగారు. మిగిలిన వాళ్లంతా తుపాకీతో కాల్చుకుని, సెనైడ్ మింగేసి రకరకాలుగా ఆత్మహత్య చేసుకున్నారు. 


ఉరిశిక్ష జీవిత ఖైదుగా 


 TADA యాక్ట్ ప్రకారం 1998 లో కోర్టు ఈ హత్యతో సంబంధం ఉన్న నళిని సహా 26 మందికి ఉరిశిక్ష విధించింది. తిరిగి కోర్టు 1999లో 26 మందిలో 19 మంది ని ఉరిశిక్ష నుంచి తప్పించింది.  జైకుమార్, రాబర్ట్ పియాస్, రవి చంద్రన్ కు ఉరికి బదులు జీవితఖైదుగా మార్చింది. నళిని, ఆమె భర్త మురుగన్, శాంతన్, ఏజీ పెరారివలన్ కు మాత్రమే ఉరిశిక్ష అమలు చేయాలని ఆదేశించింది. 2014 లో తిరిగి సుప్రీంకోర్టు ముగ్గురి ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. కారణం 2013 లో ఉరిశిక్ష పడిన నలుగురిలో ఒకరైన పెరారివలన్ కన్విక్షన్ తప్పు అని తేలటమే. దీంతో తమిళనాడు నుంచి కేంద్రం మీద ఒత్తిడి ఎక్కువైంది. ఎవరైతే దోషులుగా జైల్లో శిక్షను అనుభవిస్తున్నారో వారు నిరపరాధులు అంటూ మొదట కరుణానిధి నేతృత్వంలోని DMK, ఆ తర్వాత జయలలిత నేతృత్వంలోని AIDMK రెండు పార్టీలు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయాలని కోరాయి. మొత్తం మీద 32 ఏళ్ల తర్వాత రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు 6 గురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలై వాళ్లంతా జైలు నుంచి బయటకు వచ్చారు.