Rajiv Gandhi Assassination Case: మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని సుప్రీంకోర్టు విడుదల చేయడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. వారిపై సానుభూతి అవసరం లేదని అన్నారు. 


వారిపై సానుభూతి అవసరం లేదు


రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు 32 ఏళ్ల పాటు శిక్ష అనుభవించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరు ఆదివారం జైలు నుంచి విడుదల అయ్యారు. దీనిపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయాన్ని చెప్పారు. రాజీవ్ గాంధీ హంతకులపై సానుభూతి అవసరం లేదు. టెర్రరిజాన్ని కొందరు పాలసీగా పెట్టుకున్నారు. వారి పట్ల, ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారి విడుదల నాకు చాలా బాధ కలిగించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యారు. 


రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్, రాబర్ట్ పేస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్‌లను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి వారిని విడుదల చేశారు.


ఆర్టికల్ 142 కింద విడుదల


 1991లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఏజీ. పేరరివాలన్‌ను విడుదల చేయాలని ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ ఆదేశాలను వెలువరించింది. ఈ నేపథ్యంలో తమను కూడా ముందస్తుగా విడుదల చేయాలంటూ దోషులు నళిని, రవిచంద్రన్‌ తదితరులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడంతో.. పేరరివాలన్‌ కేసులో తీర్పే వీరికీ వర్తిస్తుందని సుప్రీం కోర్టుస్పష్టం చేసింది. 


తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో 1991 మే లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) అనే శ్రీలంకన్ తీవ్రవాద గ్రూపు హతమార్చింది. ఈ దుర్ఘటనలో రాజీవ్‌ గాంధీతో పాటు మరో 14 మంది మరణించారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఆ మరుసటి ఏడాదే పేరరివాలన్‌ సహా మురుగన్‌, నళిని, శాంతన్‌ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాలన్‌తో పాటు శాంతన్‌, మురుగన్‌ శిక్షను జీవితఖైదుగా మార్చింది. సోనియాగాంధీ జోక్యంతో 2000లో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు. ఆ తర్వాత మిగతా ముగ్గురికి కూడా మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.