BJP Shinde Sena Alliance:
రానున్న ఎన్నికల్లో పొత్తు..
రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఏక్‌నాథ్ శిందే "శివసేన"తో పొత్తు పెట్టుకుంటామని బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ఈ విషయాన్ని వెల్లడించారు. "ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాం. 45 లోక్‌సభ సీట్లతో పాటు 200 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం" అని స్పష్టం చేశారు. ముంబయి మున్సిపల్ ఎన్నికల్లోనూ శిందే పార్టీతోనే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది బీజేపీ. బీజేపీకి చెందిన అభ్యర్థి ముంబయికి మేయర్ కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. శిందే శివసేనతో దీర్ఘకాలం పాటు పొత్తు కొనసాగుతుందని తెలిపింది. "ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తాయి. ఇక్కడ శివసేన అంటే... బాలాసాహెబ్ ఠాక్రే ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే, అసలైన హిందుత్వ సిద్ధాంతాలు పాటించే శిందే శివసేన అని అర్థం" అని స్పష్టతనిచ్చారు.
ఫడణవీస్ వ్యాఖ్యలు..
2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ఇటీవల దేవేంద్ర ఫడణవీస్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. సీఎం శిందే నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. కచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందన్న నమ్మకముందని స్పష్టం చేశారు. దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చారన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. "వెన్నుపోటు పొడిచినందుకు పగ తీర్చుకున్నారు" అని మహా వికాస్ అఘాడీ కూటమి పడిపోవటానికి కారణమైన నేతలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. శిందే నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలనూ ఎదుర్కొంటామని వెల్లడించారు. ఇదే సమయంలో "ఠాక్రే ప్రభుత్వం పడిపోవటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేవేంద్ర ఫడణవీస్. అధిష్ఠానంతో తనతో సంప్రదింపులు జరిపిన తరవాతే...ఏక్‌నాథ్ శిందేని ముఖ్యమంత్రిగా ప్రకటించారని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిని తాను కోరుకోలేదని, కానీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను డిప్యుటీ సీఎం పదవిని అంగీకరించానని తెలిపారు. బృహణ్ ముంబయి కార్పొరేషన్ (BMC)ఎన్నికలు సమీపించాయి. ఈ ఎన్నికలు కూడా మహారాష్ట్ర రాజకీయాలను మరో మెట్టు ఎక్కించాయి. భాజపా, శివసేన మధ్య వైరాన్ని, దూరాన్ని ఇంకాస్త పెంచనున్నాయి.
ప్రస్తుతం అక్కడి రాజకీయాలు "మరాఠీ ముస్లిం"ల చుట్టూ తిరుగుతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే వర్గం "మరాఠీ ముస్లింల" మద్దతు తమకే ఉంటుందని స్పష్టం చేస్తోంది. అటు భాజపా దీన్ని కొట్టి పారేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడింది. ముంబయి భాజపా అధ్యక్షుడు ఆశిష్ షెలార్ తీవ్రంగా విమర్శలు చేశారు. "ముంబయిలోని మరాఠీలు, ముస్లింలు మద్దతు కోసం ఉద్ధవ్ వర్గం తాపత్రయపడుతోంది. కానీ చాలా తెలివిగా ఈ రెండు పదాలని కలిపి మరాఠీ ముస్లింల మద్దతు తమకే ఉందని చెప్పుకుంటోంది" అని అన్నారు.
Also Read: Russia-Ukraine War: ఎవ్వర్నీ వదలం, అందరి లెక్కలూ తేల్చేస్తాం - రష్యాపై జెలెన్‌స్కీ ఆగ్రహం