Rajiv Gandhi Case Convict Nalini:


నాకెలాంటి సంబంధం లేదు : నళిని 


రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన ఏడుగురిలో ఆరుగురు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. అంతకు ముందే ఓ దోషి విడుదల కాగా... ఇప్పుడు మిగిలిన వాళ్లూ కటకటాల నుంచి బయటపడ్డారు. వీళ్లను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ అయితే తీవ్రంగా మండి పడుతోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సుప్రీం కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన దోషులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 30 ఏళ్లలో తాము ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో మీడియాకు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే నళిని శ్రీహరన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. "ఈ హత్య చేసినందుకు మీకు గిల్టీగా అనిపించడం లేదా" అని ప్రశ్నించగా...చాలా బ్యాలెన్స్‌డ్‌గా సమాధానం చెప్పారు నళిని. "అసలు నాకీ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచానికి నేనో దోషినే కావచ్చు. కానీ...అప్పుడేం జరిగిందో, నిజానిజాలేంటో నా మనస్సాక్షికి తెలుసు" అని బదులిచ్చారు. ఆ హత్య చేసిన గ్రూప్‌లో ఒకరిగా ఉండటం వల్లే అనుమానించి నాపై హత్యానేరం మోపారని వివరించారు. "హత్యకు పాల్పడిన వాళ్లంతా నా భర్త స్నేహితులు. నాకు వాళ్లతో కొంత పరిచయం ఉంది. నేను చాలా మితభాషిని. వాళ్లతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్లకు అవసరమైన సాయం చేసే దాన్ని. వాళ్లతో పాటు  వెళ్లేదాన్ని. అంతకు మించి వాళ్లతో నాకు వ్యక్తిగత పరిచయాలు ఏమీ లేవు. అసలు వాళ్ల కుటుంబ నేపథ్యాలేంటో కూడా నాకు తెలియదు" అని చెప్పారు నళిని శ్రీహరన్. 2001లో మరణశిక్ష విధించినప్పటి పరిస్థితులనూ వివరించారు. "నన్ను ఎప్పటికైనా ఉరి తీస్తారన్న నిర్ణయానికి వచ్చేశాను. అందుకు నేను ఎప్పుడో సిద్ధపడ్డాను. దాదాపు 7 సార్లు నన్ను ఉరి తీసేందుకు ప్రయత్నాలు జరిగాయి." అని చెప్పారు. అయితే...ప్రియాంక గాంధీతో మాట్లాడిన తరవాత తనకు కాస్త ధైర్యం వచ్చిందని అన్నారు. 


ప్రియాంక గాంధీ చాలా మంచి వ్యక్తి..


"ప్రియాంక గాంధీ ఎంతో మంచి వ్యక్తి. నా దృష్టిలో ఆమె ఓ దేవత. ఆమెను కలిశాకే నాపైన నాకు గౌరవం పెరిగింది. అప్పటికి జైల్‌లో మమ్మల్ని మరీ అవమానకరంగా చూసేవారు. ఆఫీసర్ల ముందు కూర్చోనిచ్చే వాళ్లు కాదు. ఎంతసేపైనా సరే నిలబడే మాట్లాడాల్సి వచ్చేది. కానీ..ప్రియాంక గాంధీ మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడారు. నా జీవితంలో అదో గొప్ప అనుభవం" అని వివరించారు నళిని. తన తండ్రిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని ఆరా తీశారని, చాలా ఎమోషనల్‌ అయిపోయి ఏడ్చేవారని గుర్తు చేశారు. తన కూతురు గురించి కూడా తలుచుకుని ఎమోషనల్ అయ్యారు నళిని. "నన్ను తను పూర్తిగా మర్చిపోయింది. తనకు రెండేళ్లున్నప్పుడే నేను జైలుకి వెళ్లాను. తప్పని పరిస్థితుల్లో వేరే వాళ్ల దగ్గర ఉంచాల్సి వచ్చింది. ఆ తరవాత నన్ను తను పూర్తిగా మర్చిపోయింది. ప్రస్తుతం ఆ బాధ నుంచి బయట పడి మళ్లీ దగ్గరవ్వాలని చూస్తున్నాను" అని చెప్పారు. 


Also Read: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హంతకులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్