Russia-Ukraine War:


జెలెన్‌స్కీ ఆగ్రహం..


ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఖేర్సన్‌లో రష్యా సైన్యం..నిబంధనలు ఉల్లంఘించి మరీ 400 వరకూ యుద్ధ నేరాలకు పాల్పడినట్టు ఆరోపించారు. ఖేర్సన్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులు, పౌరుల మృతదేహాలు భారీగా బయట పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. "పూర్తి స్థాయి విచారణ జరిపిన తరవాత ఖేర్సన్‌లో రష్యా 400 యుద్ధ నేరాలకు పాల్పడినట్టు తేలింది. పెద్ద మొత్తంలో సైనికులు, పౌరుల డెడ్‌బాడీలు
రికవరీ చేస్తున్నాం" అని వెల్లడించారు. రష్యా సైనికులు వెనక్కి మళ్లే ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మళ్లీ అక్కడి పౌరులను ఆ ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని చెప్పారు. "ఖేర్సన్‌లో మాత్రమే కాదు. ఉక్రెయిన్‌లో వాళ్లు కాలు మోపిన ప్రతి చోట ఇలాంటి దారుణాలకే ఒడిగట్టారు. ఇలాంటి హత్యలు చేసిన వాళ్లెవరినీ వదలం" అని తేల్చి చెప్పారు. నిజానికి...రష్యాపై ఐక్యరాజ్య సమితి ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తోంది. నిబంధనలు అతిక్రమించి యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించింది. ఉక్రెయిన్ పౌరుల పట్ల రష్యా సైనికులు అత్యంత దారుణంగా వ్యవహరించారని మండి పడింది. "ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం పాల్పడుతున్న యుద్ధ నేరాలన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి" అని గతంలోనే స్పష్టం చేసింది ఐరాస. 


అంతర్జాతీయ చర్చ..


ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంపై అంతర్జాతీయంగా నాలుగైదు నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎన్ని హెచ్చరికలు చేసినా పుతిన్ పట్టించుకోవటం లేదు. ఐక్యరాజ్య సమితి వారించినా...అదే పరిస్థితి. అన్ని దేశాలు మూకుమ్మడిగా మాటల యుద్ధం చేస్తున్నా...రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అటు ఉక్రెయిన్ కూడా గట్టిగానే పోరాడుతోంది. రష్యా ఆక్రమిత ప్రాంతాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు 
ప్రయత్నిస్తున్నాయి. అయితే...అటు నాటో దళాలు కూడా రష్యాను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగనున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా నేతృత్వం వహించే నాటో దళాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే...అప్పుడది రష్యా వర్సెస్ అమెరికా యుద్ధంగా మారిపోక తప్పదు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...పుతిన్‌ను చాలా సందర్భాల్లో హెచ్చరించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించి మరీ కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగానే బదులిస్తామని తేల్చి చెప్పారు. అటు పుతిన్ కూడా ఈ సారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ నాటో దళాలు కనుక రష్యా సైన్యంతో తలపడేందుకు సిద్ధమైతే "మహా విపత్తు" వస్తుందనిహెచ్చరించారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల ప్రయోగానికి కూడా వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల హెచ్చరించారు. అయితే తాజాగా మూడో ప్రపంచ యుద్ధం (Russia Warns World War III Against Ukraine) రావొచ్చని రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొవడం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్‌ వెన్డిక్టోవ్‌ హెచ్చరించారు.


Also Read: Anti Hijab Protest: ప్రభుత్వానికే ఎదురు తిరుగుతావా, మరణ శిక్ష తప్పదు - ఇరాన్ కోర్ట్ సంచలన తీర్పు