Anti Hijab Protest: 


యాంటీ హిజాబ్ ఉద్యమం..


ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ యువతి మరణంతో మొదలైన ఈ ఉద్యమం...దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తోంది. ఆ మధ్య మరో యువతిని దుండగులు కాల్చి చంపారు. దీనిపైనా సరిగా విచారణ జరపలేదు. ఇది కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యేనని ఇరాన్ పౌరులు నినదిస్తున్నారు. రోజురోజుకీ నిరసనలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే..Iran's Revolutionary Court సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసిన ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించింది.  మరో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మహసా అమిని హత్యకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగామారాయని, అందుకే ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించామని కోర్టు వివరించింది. ప్రభుత్వ బిల్డింగ్‌కు నిప్పు పెట్టడమే కాకుండా జాతీయ భద్రతకు భంగం కలిగించాడన్న కారణాలు చూపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరానియన్ చట్టంలో ఇవి చాలా తీవ్రమైన నేరాలని, మిజాన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ వివరించింది. టెహ్రాన్‌లోని ఓ కోర్టు ఐదుగురు నిరసనకారులకు 5-10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. "పెద్ద ఎత్తున గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, జాతీయ భద్రతకు భంగం కలిగించటం, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం" లాంటివాటిని కారణాలుగా చూపింది. ఇప్పటికే మూడు ప్రావిన్స్‌లలో మొత్తం 750 మందికి ఇలాంటి శిక్షలే విధించాయి కోర్టులు. దేశవ్యాప్తంగా 2 వేల మందికీ శిక్ష విధించింది ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఇరానియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ చేతిలో 326 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 


పెరుగుతున్న మద్దతు..


మహసా అమినీ చనిపోయి 40 రోజులు పూర్తైన సందర్భంగా గత నెల ఆమె హోమ్‌టౌన్‌కు వేలాది మంది ఆందోళనకారులు తరలివెళ్లారు. అక్కడే నిరసన చేపట్టారు. వెస్టర్న్ కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లో ఆమె సమాధి వద్దకు వేలాది మంది రావటం స్థానికంగా కలకలం రేపింది. ఇరాన్ భద్రతా బలగాలు ఒక్కసారిగా అక్కడికి వచ్చి కాల్పులకు దిగాయి. అప్పటికే 10 వేల మంది అక్కడికి తరలి వచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ఆర్మీ బేస్‌పై దాడి చేసేందుకే ఇంత మంది వచ్చారని కొందరు వాదిస్తున్నారు.
ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఇరాన్‌కు సపోర్ట్ ఇస్తోంది. యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఇప్పటికే ఇరాన్ మహిళలకు మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేశారు. తరవాత అమెరికాలోని పౌరులు కూడా వారికి అండగా నిలిచారు. లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీలో వేలాది మంది రోడ్లపైకి వచ్చిఇరాన్ 
మహిళలకు మద్దతుగా నిలిచారు. AP న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం...అన్ని వయసుల వాళ్లు రోడ్లపైకి వచ్చి ఇరాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూఎస్ నేషనల్ మాల్ (US National Mall) వద్ద ఇరాన్‌ దేశ జెండాను పట్టుకుని నిరసన తెలిపారు. "మేమంతా ఒక్కటవుతున్నాం. ఇక మీరు భయపడాల్సిందే" అంటూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ నినాదాలు చేశారు. 


Also Read: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో దర్యాప్తు వేగవంతం- ఏక కాలంలో ఐదు రాష్ట్రాల్లో సిట్‌ అధికారుల తనిఖీలు