గుంటూరు జిల్లాలోని మంగళగిరి,తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కొలనుకొండ డంపింగ్ యార్డ్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో స్దానికులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున పొగ చుట్టు పక్కల ప్రాంతాన్ని కమ్మేసింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మంటను అదుపులోకి తెచ్చారు. జరిగిన ఘటనకు కారకులైన వారి ఎవరనేది మున్సిపల్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆకతాయిల పనేనా...
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కొలనుకొండ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ యార్డులో మంట పెట్టడంతో కొద్ది సేపటికే మంటలు యార్డ్ మొత్తం విస్తరించాయి. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
డంపింగ్ యార్డుకు సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్, డీజీపీ కార్యాలయం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యలయం, నివాస గృహాలు, హైవే రోడ్డు ఉండటంతో అధికారులు టెన్షన్ పెడ్డారు. తగలబడిపోతున్న యార్డ్ నుంచి దట్టమైన పొగలు రావడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆకతాయిలు నిప్పు అంటించటంతో మంటలు వ్యాపించాయని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయిన, ఆకతాయి చేష్టలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శివారు ప్రాంతం కావటంతో చుట్టు పక్కల యువకులు కొందరు రాత్రి వేళ ఈ ప్రాంతానికి వచ్చి మద్యం, గంజాయి సేవిస్తున్నారని టాక్. మత్తులో గడవలు పడి భయాందోళనకరమయిన పరిస్థితులకు కారణం అవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్థానిక అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని అంటున్నారు. మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డ్‌కు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయటం, లేదా రక్షణ గోడను నిర్మించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
చుట్టుపక్కల చెత్త అంతా ఇక్కడే...
మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ ప్రాంతంలో దాదాపు సగం రాజధాని ఉంటుంది. అత్యంత కీలకమయిన ప్రభుత్వ కార్యాలయాలతోపాటుగా, రాకపోకలు అధికంగా సాగే ప్రాంతం కావటంతో చెత్తా చెదారం కూడా ఎక్కువగా ఉంటుంది. మంగళగిరి నుంచి చెత్త తరలించి ఇక్కడే డంప్ చేస్తారు. రోజు 40 నుంచి 60 టన్నుల చెత్త ఈ ప్రాంతంలో డంప్ అవుతుందని చెబుతున్నారు. తాడేపల్లి పట్టణం, రూరల్ మండల గ్రామాలకు చెందిన చెత్త మొత్తం ఇక్కడే డంప్ చేస్తారు.
చుట్టు పక్కల గ్రామాల్లోని చెత్తను కూడా ఆయా పంచాయితీల్లోని మున్సిపల్ అధికారులు ఇక్కడే డంప్ చేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య సమస్య కూడా తలెత్తుతుందని అంటున్నారు. ఇంత పెద్ద డంపింగ్ యార్డుకు సెక్యూరిటీ లోపించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అగ్ని ప్రమాదానికి కారకులైన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీని అధనంగా పెంచాలని కోరుతున్నారు.
డంపింగ్ యార్డ్ కష్టాలు.....
డంపింగ్ యార్డ్‌పై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉండాల్సిన డంపింగ్ యార్డులు నివాసాలకు సమీపంలో ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయిన అంటున్నారు. ఇప్పటికే విజయవాడ నగర పాలక సంస్థకు చెత్త డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. కొన్ని సందర్భాల్లో అక్కడ నుంచి కూడా చెత్తను ఇక్కడకు డంప్ చేస్తుంటారు. విజయవాడ కార్పోరేషన్ అధికారులు సొంతంగా డంపింగ్ యార్డ్ కోసం స్థలం సేకరించేందుకు కూడా ప్రయత్నించారు. అయితే స్థానికులు నుంచి వ్యతిరేకత రావటంతో అధికారులు తాత్కాలికంగా విరమించుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.