మునుగోడు ఉఎన్నికతో తెలంగాణలోని పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఏ పని చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఆ పనిని పూర్తిస్థాయిలో కొనసాగిస్తుండగా మిగతా పార్టీలు కూడా తన వ్యూహాన్ని పదును పెడుతున్నాయి.
మనుగోడు ఉపఎన్నికతో మంచి జోష్ మీద ఉన్న అధికార పార్టీ టీఆర్‌ఎస్... వచ్చే ఎన్నికల వరకు దీన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు సరిపడా ప్లాన్స్ వర్కౌట్ చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ముందుగా మహబూబాబాద్ జిల్లాలో లక్ష మందితో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ ప్రకటించారు. మానుకోటలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులతోపాటు ఎంపీ, టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత, జడ్పీ చైర్‌పర్సన్ బిందు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ, టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్, ఇల్లందు, కురవి రోడ్లు, సాలార్‌తండా స్థలాలను పరిశీలించారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రజల కోసం ఏర్పాటు, రవాణాకు ఇబ్బంది లేకుండా ఉండేలా స్థలాన్ని ఎంచుకోనున్నారు. ఈ స్థలాన్ని పరిశీలించిన తర్వాత కలెక్టరేట్‌లో మంత్రులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో మహబూబాబాద్ జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ టూర్‌లో సీఎం కేసీఆర్ కలెక్టర్ కార్యాలయం, టీఆర్‌ఎస్ ఆఫీసు ప్రారంభిస్తారు.
ప్రతి జిల్లాలో ఓ భారీ బహిరంగ సభ ఉండేలా టీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఎన్నకల కంటే ముందు నుంచే దూకుడుగా ఉన్న బీజేపీ... అధిష్ఠానం పెద్దలతో భారీ సభలు ప్లాన్ చేసింది. మొన్నటి మొన్న ప్రధాన మంత్రి కూడా వచ్చారు. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు చేశారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తూనే... తాము చేసిన అభివృద్ధి చెప్పపడంతోపాటు... జాతీయ రాజకీయాల అంశాన్ని కూడా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్ స్కెచ్ వేస్తోంది. ఓ వైపు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతూనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు శ్రేణులను, పార్టీ నేతలను సిద్ధం చేసుకునేలా టీఆర్‌ఎస్ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.